సాక్షి, హైదరాబాద్: మద్యం షాపుల కేటాయింపుల్లో ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మద్యం షాపుల కేటాయింపులో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వాసిరెడ్డి రవికాంత్‌పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. కులం ఆధారంగా రిజర్వేషను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, బీసీల్లో 132 కులాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు.
ఎక్సైజ్ చట్టం ప్రకారం మద్యం దుకాణాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక కులానికి రిజర్వేషన్లు కల్పిస్తే మిగిలిన కులాలపట్ల వివక్షత చూపించినట్లేనని తెలిపారు. వెనుకబడిన కులాల ఆర్థిక పురోభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ.. మరోవైపు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు, లైసెన్స్ ఫీజును రూ.కోటి పది లక్షలు పెట్టిందని, ఆయా వర్గాలు ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.
సవరణ జీవో 100 జారీ చేశాం...
కాగా, వెనకబడిన వర్గాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించామని, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులు కల్లుగీతపై ఆధారపడి కల్లు దురాణాలను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని.. తాటి, ఈత చెట్లు తగ్గిపోవడంతో వారికి జీవనోపాధి లేకుండా పోయిందన్నారు.
పిటిషనర్లు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేయలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం వారికి లేదని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో మూడు మద్యం దుకాణాలను వేలం వేయకుండా ఉంచుతామని, పిటిషనర్లు దరఖాస్తు చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment