K. Lakshman
-
ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: మద్యం షాపుల కేటాయింపుల్లో ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మద్యం షాపుల కేటాయింపులో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వాసిరెడ్డి రవికాంత్పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. కులం ఆధారంగా రిజర్వేషను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, బీసీల్లో 132 కులాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం మద్యం దుకాణాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక కులానికి రిజర్వేషన్లు కల్పిస్తే మిగిలిన కులాలపట్ల వివక్షత చూపించినట్లేనని తెలిపారు. వెనుకబడిన కులాల ఆర్థిక పురోభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ.. మరోవైపు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు, లైసెన్స్ ఫీజును రూ.కోటి పది లక్షలు పెట్టిందని, ఆయా వర్గాలు ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. సవరణ జీవో 100 జారీ చేశాం... కాగా, వెనకబడిన వర్గాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించామని, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులు కల్లుగీతపై ఆధారపడి కల్లు దురాణాలను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని.. తాటి, ఈత చెట్లు తగ్గిపోవడంతో వారికి జీవనోపాధి లేకుండా పోయిందన్నారు. పిటిషనర్లు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేయలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం వారికి లేదని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో మూడు మద్యం దుకాణాలను వేలం వేయకుండా ఉంచుతామని, పిటిషనర్లు దరఖాస్తు చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. -
గోరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు
హైదరాబాద్: గోరక్షణ కోసం చంపడానికైనా, చావడానికైనా తాను సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా పాతబస్తీలోకి మూడు వేలకుపైగా ఆవులు, ఎద్దులు, దూడలను తీసుకువచ్చారని, వాటిని కాపాడే క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని ప్రకటించారు. 4 రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాజీనామా లేఖ అందించానన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే అన్ని రహదారుల్లో బక్రీద్‌కు నెలరోజుల ముందే గత ప్రభుత్వాలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేవని, జంతువులను తరలించేవారిపై కఠినంగా వ్యవహరించేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో యాగాలు, వ్రతాలు చేస్తారే కానీ, గోవులను, ఎద్దులను కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలేదని అన్నారు, ఆవు, ఎద్దు విశిష్టత గురించి ఆయన నమ్మే సిద్ధాంతిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గోరక్షణ కోసం గొడవలు, హత్యలు జరిగాయని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని, అది ఎటు తిప్పితే ప్రభుత్వం అటు తిరుగుతోందని ఆరోపించారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఎద్దులు కూడా పనికిరానివంటూ మున్సిపల్ పశు వైద్యులు లంచం తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారంలోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వేలాదిగా ఉన్న గోరక్షదళ్ కార్యకర్తలతో తామే గోవులను కాపాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్, అజయ్‌రాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ గారూ.. మీ కేబినెట్లో మహిళలేరీ..?’
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ మాత్రమే రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. పార్టీలోని మూడో వంతు పోస్టులు మహిళలకే కేటాయించిందన్నారు. అత్యధిక మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఘనత కూడా బీజేపీకే దక్కుతుందన్నారు. మోదీ కూడా తన మంత్రి వర్గంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రాధాన్యమిచ్చారన్నారు. మిగిలిన పార్టీలు కేవలం మాటలకే పరిమితయ్యాయని విమర్శించారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని..ఈ విషయం ఆధారంగా మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ గారూ.. మీలో కాంగ్రెస్ భావాలు పోలేదు.. మీ పాపాల ప్రక్షాళన మోదీ చేస్తున్నారు.. వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు... మరి మీరంటున్న గుణాత్మకమైన మార్పు అంటే ఏమిటి.. మహిళలు లేకుండా చేయడమేనా’ అని ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం బీజేపీ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం బీజేపీకే సాధ్యమని వ్యాఖ్యానించారు. -
పార్టీలో కుట్ర జరుగుతోంది: బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీపై ఆపార్టీకే చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు రాజాసింగ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై రాష్ట్ర బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు పదవులు కట్టబెట్టారని, నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ కమిటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది అనుకుంటే, పార్టీ నుంచి తొలగించమని లక్ష్మణ్‌ను లేఖ ద్వారా కోరారు. కాగా గత నెలలో తెలంగాణలో అమిత్ షా పర్యటన సందర్భంగా కూడా రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువని.. ఈ గ్రూపుల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు. -
‘అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటాం’
సిద్దిపేట రూరల్: అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వారి ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన కరీంనగర్ వెళుతూ మార్గమధ్యంలో సిద్దిపేట వద్ద కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా ఉండాలని కోరుకుంటోందని విమర్శించారు. రాష్ట్రమంతా కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు. -
గొప్పల కోసమే 'ఆసరా' పథకం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గొప్పల కోసమే ఆసరా పథకాన్ని ప్రారంభించారని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లక్ష్మణ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 4 లక్షల 60 వేల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మహిళలు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వెల్లడించారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికి పింఛన్లు అందేవరకు పోరాడతామని చెప్పారు. అలాగే పింఛన్ల అంశంపై సభలో చర్చ చేపట్టేందుకు తాము పట్టుబడతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.