సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ మాత్రమే రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. పార్టీలోని మూడో వంతు పోస్టులు మహిళలకే కేటాయించిందన్నారు. అత్యధిక మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఘనత కూడా బీజేపీకే దక్కుతుందన్నారు. మోదీ కూడా తన మంత్రి వర్గంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రాధాన్యమిచ్చారన్నారు. మిగిలిన పార్టీలు కేవలం మాటలకే పరిమితయ్యాయని విమర్శించారు.
మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని..ఈ విషయం ఆధారంగా మహిళల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ గారూ.. మీలో కాంగ్రెస్ భావాలు పోలేదు.. మీ పాపాల ప్రక్షాళన మోదీ చేస్తున్నారు.. వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు... మరి మీరంటున్న గుణాత్మకమైన మార్పు అంటే ఏమిటి.. మహిళలు లేకుండా చేయడమేనా’ అని ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం బీజేపీ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం బీజేపీకే సాధ్యమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment