అనురాగ్ ఠాకూర్ కొత్త ఇన్నింగ్స్!
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ ఎంపీ, బీసిసిఐ ఛీఫ్ అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు ఎల్టీ అనురాగ్ ఠాకూర్ గా మారిపోయారు. శుక్రవారం ఆయన టెరిటోరియల్ ఆర్మ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్ లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుహాగ్ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త బాధ్యతలు చేపట్టారు. దీంతో మిలటరీలో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా ఠాకూర్ రికార్డు సృష్టించారు.
బీసీసీఐ చీఫ్, బిజేపీ ఎంపి, 41 ఏళ్ళ అనురాగ్ ఠాకూర్ ఆర్మీ ఆఫీసర్ గా శుక్రవారం ఉదయం నూతన బాధ్యతలు స్వీకరించారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలోచేరి, దేశానికి సేవ చేయాలన్న కోరిక చిన్నతనంనుంచీ బలంగా ఉండేదని వేడుక సందర్భంగా మాట్లాడిన ఠాకూర్ తెలిపారు. తన కల ఇన్నాళ్ళకు సాకారమైందని, టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తూ... దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, దేశ భద్రతకు తనవంతు సేవ అందిస్తానని ఠాకూర్ పేర్కొన్నారు.
టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన పరీక్షను పూర్తి చేసిన అనంతరం ఠాకూర్ తన పర్సనల్ ఇంటర్వ్యూను ఛండీగఢ్ లోనూ, ట్రైనింగ్ ను భోపాల్ లోనూ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికైన ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ కు అవసరమైన ట్రైనింగ్ ను పూర్తి చేశారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెలనుంచి, సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటీర్లను, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు.