సాక్షి, హైదరాబాద్: పనిచేయని వైద్యుల పనిపట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను మరింత మెరుగుపర్చే చర్యలకు శ్రీకారం చుడుతోంది. విధి నిర్వహణలో అలసత్వం వహించే వైద్యులకు ‘షాక్ ట్రీట్‌మెంట్’ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా, అనధికారికంగా గైర్హాజరవుతు న్న 80 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది.
ఈ మేరకు ఫైలుపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సంతకం కూడా చేశారు. నోటీసులకు సకాలంలో స్పందించనివారిని విధుల నుంచి తొలగించాల ని వైద్య, ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన కార్డియాలజీ, ఆర్థో, గైనకాలజీ, రేడియాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలకు చెందిన ఈ స్పెషలిస్ట్ వైద్యు లు ప్రైవేట్ పాక్టీస్ పెట్టుకోవడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచే యడం, భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వకపోవ డం, సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉండటం తదితర కారణాలతో అనధికారికంగా గైర్హాజరవుతున్నట్లు గుర్తించిం ది. వేటు పడిన తర్వాత అలా ఖాళీ అయ్యే పోస్టులను తక్షణమే నింపాలని కూడా అధికారులు నిర్ణయించారు.
డాక్టర్ల పనితీరుపై సమీక్ష
‘హైదరాబాద్‌లోని ఒక బోధనాసుపత్రిలో పనిచేసే ఓ స్పెషలిస్ట్ 20 ఏళ్లలో ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు. కీలకమైన విభాగానికి చెందిన ఈయన ఇంకా ఏం పనిచేస్తున్నట్లు?’ఇది కీలకమైన ప్రజాప్రతినిధికి వచ్చిన ప్రశ్న. రాష్ట్రంలో ఏరియా, బోధన, ఇతర ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులున్నా, వారిలో కొందరు ఏమాత్రం పనిచేయడంలేదని వైద్యవర్గాలకు స్పష్టమైన సమాచారం ఉంది.
కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజుకు 20 వరకు కాన్పులు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకు 50 కూడా చేయని పరిస్థితి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాన్పులకు వచ్చేవారిని నిరుత్సాహపరచడం, డాక్టర్ అందుబాటులో లేకపోవడం వంటివి ఈ దుస్థితికి కారణాలుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల వైద్యుల పనితీరుపై నివేదికలు దాదాపు పూర్తయ్యాయి. తక్కువ పనితీరున్న డాక్టర్లను బదిలీ చేసే అవకాశముంది. వారి అవసరం పెద్దగా లేనిచోటుకు తరలిస్తారు.
వైద్య పోస్టుల హేతుబద్ధీకరణ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కోచోట ఒక్కో విచి త్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని ఆసుపత్రుల్లోనైతే రోజూ వచ్చే రోగుల కంటే డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల రోగులు ఎక్కువ వస్తున్నా డాక్టర్లు సరిపడా లేరు. ఎన్నాళ్లుగానో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది డాక్టర్లు ఉన్నచోట నుంచి కొరత ఉన్న ఆసుపత్రులకు డాక్టర్లను పంపాలని, ఆ విధంగా హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుంది. రాజకీయ ఒత్తిళ్లను ఖాతరు చేయకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా డాక్టర్ల సంఘాలతో ముందస్తుగా చర్చించి వాటి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment