సభలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్
ఖమ్మం: ‘కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు పెద్దగా సహకారం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. విభజన చట్టంలో ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఏ ఒక్క మాటా నిలుపు కోలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీ పేటలో కోచ్ ఫ్యాక్టరీ కావొచ్చు.. మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కావొచ్చు. మన దగ్గర నుంచి తీసుకోవడమే తప్ప.. తిరిగి ఇచ్చింది లేదు. ఇన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్లో.. సీఎం నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ఖమ్మం నగరంలో రూ.25 కోట్లతో ఆధునిక బస్టాండ్‌ను నిర్మించుకున్నాం. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం ఉండ టంతో దేశవృద్ధి రేటు కన్నా రెట్టింపు వేగంతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది.
రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1.49 లక్షల కోట్లకు పెరిగాయి’అని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో రూ.423.26 కోట్లకు సంబంధించి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, నిర్మాణం చేయనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరంలో నూతన ఆర్టీసీ బస్టాండ్, 1,004 డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వైకుంఠధామం, మిషన్ భగీరథ కింద ఏర్పాటు చేసిన 45 వేల మంచినీటి కనెక్షన్లతోపాటు ఇంటింటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. రెండో ఐటీ హబ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లి నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్స వం చేయడంతోపాటు వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట రవాణా మంత్రి పువ్వాడ అజయ్, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఐటీ హబ్ ప్రాంతం, నూతన బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ బాట..
దేశంలోనే బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, పుణే వంటి నగరాలను కాదని ఐటీ కంపెనీలు హైదరాబాద్ బాట పడుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలైన ఖమ్మం, కరీంనగర్, నిజామా బాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఐటీ హబ్‌లు వచ్చాయని, త్వరలో నల్లగొండ, సిద్దిపేట, రామగుండం ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత హైదరాబాద్‌కో.. బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీ ఫైబర్ ప్రాజె క్టుతో రాష్ట్రంలోని కోటి ఇళ్లకు రానున్న కాలంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కామర్స్, ఎడ్యుకేషన్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం స్వయంగా పూనుకుని ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా కృషి చేస్తున్నారన్నారు.
ఖమ్మం వచ్చి నేర్చుకోవాలి..
ఏ ప్రభుత్వమైనా, ప్రజాప్రతినిధి అయినా కోరుకునేది ప్రజల కోసం తపించడమేనని, మంత్రి పువ్వాడ కూడా అలాగే చేస్తున్నారన్నారు. ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి నేర్చుకోవాలన్నారు. ముందు చూపుతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో ఖమ్మం రూపురేఖలే మారాయన్నారు. మిగిలిన పనులు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు. మంచి చేసే వారిని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారన్నారు. చేసిన పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మనం చేసిన పనులు చెప్పుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్‌రావు, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment