
ఐఎఫ్‌ఎస్ అధికారులతో మాట్లాడుతున్న కేటీఆర్
గచ్చిబౌలి: ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారులతో సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గచ్చి బౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అందుకు వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాధించిన ప్రగతి, ఎకో సిస్టమ్‌ను ఆయన వారికి వివరించారు.
టీహబ్, వీహబ్, ఇంక్యుబేటర్ల గురించి టీహబ్ రెండోఫేజ్ గురించి కూడా వారికి వివరించారు. ఐఎఫ్‌ఎస్ అధికారుల మిడ్ కేరీర్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన వారితో భేటీ కావడంతోపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఎస్‌బీ ఫ్యాకల్టీ ప్రతినిధులు, ఐఎఫ్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.