సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో పార్టీ అధినేత ఇంకా కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదు. పీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డిని బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్ ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టమైన మాత్రం హామీ ఇచ్చారు. ఆయనకు హుజూరా బాద్‌కు, కరీంనగర్ జిల్లాకు, రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించే పదవి దక్కుతుందని నొక్కి చెప్పారు. ‘కౌశిక్‌రెడ్డి ఏదో ఒక చిన్న పదవితోనే ఆగిపోడు. ఉజ్వల భవిష్యత్తు ఉంటది.
ఎదుగుతున్న యువకులే భవిష్యత్ నిర్మాతలు. ఎవరు ఏమన్నా ప్రయాణం కొనసాగుతుంది’ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కౌశిక్‌రెడ్డి మంచి క్రికెటర్ అని చెపుతూ రాష్ట్ర స్థాయి పదవి ఇస్తాననడంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్)కి చైర్మన్‌గా నియమిస్తారన్న ప్రచారం నిజం కానున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ చుట్టూనే కేసీఆర్ ప్రసంగం సాగినా.. అసెంబ్లీ టికెట్టు ఎవరికి అనే విషయంలో మాట దొర్లలేదు. దీనిని బట్టి కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్ టికెట్టు రేసు నుంచి తప్పించినట్టేనని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు.
హుజూరాబాద్‌లో దళితబంధు 100 శాతం పెట్టుడే
‘దళితబంధును హుజూరాబాద్ నుంచే పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు పెడుతున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే అని అంటున్నారని నిన్న ఒకతను చెప్పాడు.. పెట్టమా మరి.. టీఆర్‌ఎస్ ఏమన్నా సన్నాసుల మఠమా..? రాజకీయ పార్టీనే కదా. ముఖ్యమంత్రిగా ఉన్న కాబట్టే ఈ పథకాన్ని పెడుతున్నప్పుడు.. రాజకీయంగా లాభం జరగాలని ఎందుకు కోరుకోం’ అని సీఎం కేసీఆర్ విమర్శుకుల మాటలను కొట్టివేశారు. హుజూరాబాద్ నుంచే దళితబంధు పథకాన్ని 100 శాతం పెడుతున్నట్లు స్పష్టం చేశారు.
‘నాకు కరీంనగర్ అంటె సెంటిమెంట్. టీఆర్‌ఎస్ పుట్టినంక సింహగర్జన అక్కడనే పెట్టినం. దాంతోనే తెలంగాణ ఉద్యమం స్టార్టయి రాష్ట్రం వచ్చింది. హుజూరాబాద్ నుంచే రైతుబంధు స్టార్ట్ చేసినం. కరీంనగర్ కేంద్రంగా రైతుబీమా ప్రకటించిన. ఇప్పుడు దళితబంధు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్న’ అని పేర్కొన్నారు.
దళితబంధు అమలులో పాలు పంచుకోవాలి
హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు పథకం అమలులో యువకులు, పార్టీ కార్యకర్తలు పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కౌశిక్‌రెడ్డి వెంట పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పథకం అమలుకు ప్రతి ఒక్కరూ సముచిత పాత్ర పోషించాలని సూచించారు.
కౌశిక్‌రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, ఆయన తండ్రి సాయినాథ్ రెడ్డి తనతోపాటు మలివిడత ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. కౌశిక్‌రెడ్డి తాత సుధాకర్‌రెడ్డి ఇతర కుటుంబసభ్యులు కూడా తనకు చాలా తెలుసని చెపుతూ మంచి భవిష్యత్తు ఉంటుందని పలుమార్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment