![Telangana: Quality Counterfeit Goods Cause Health Problems People - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/4/Untit.jpg.webp?itok=WW4wMu2a)
సాక్షి,ఇచ్చోడ(అదిలాబాద్): కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా జిల్లాలో నిత్యావసరాల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కట్టడి చేయాల్సిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కారం, పసుపు, నూనె, ఉప్పు, పప్పు, పాలు, పెరుగు, సబ్బులు, షాంపులు, టీ పొడి, చివరకు దేవుడి దీపాలకు ఉపయోగించే నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కల్తీ నిత్యావసరాలను పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా జిల్లాలో పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కల్తీ సరుకులను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయిల దుకాణాలు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లలో కల్తీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
బ్రాండెడ్ పేరుతో విక్రయాలు...
జిల్లాలోని దుకాణాల్లో విక్రయిస్తున్న నిత్యావసర సరుకుల్లో అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా మారుతోంది. బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకుల వ్యాపారం జరుగుతోంది. అసలును పోలిన ప్యాకింగ్, కాస్త ధర తగ్గించి విక్రయిస్తుండడంతో వినియోగదారులు నకిలీ గుర్తించలేకపోతున్నారు. నిత్యావసరాలే లక్ష్యంగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది.
నిత్యం రూ.కోటి వ్యాపారం..
జిల్లాలో ప్రతీరోజు నిత్యావసర సరుకుల వ్యాపారం రూ.కోటి వరకు జరుగుతోంది. ధనికుల నుంచి నిరు పేదల వరకు నిత్యం వాడే నూనె, సబ్బులు, టీ పౌడర్, పప్పు, ఉప్పు, కారం, పంచదార ఇలా 30 రకాల వస్తువులు కల్తీ అవుతున్నాయి. వీటినే వ్యాపారులు ప్రజలకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారసంతల్లో కల్తీ వస్తువుల విక్రయాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వ్యాపారులకు తక్కువ ధరకు వస్తుండడం, లాభం ఎక్కువగా ఉండడంతో వారు కూడా కల్తీ సరుకుల విక్రయాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు..
రోడ్ల పక్కన విక్రయించే టిఫిన్లు, మిర్చి బజీలు, పానీ పూరి, కట్లెస్‌తోపాటు ఐస్‌క్రీం వరకు అన్నింటిలో కల్తీ జరుగుతోంది. ప్రతీరోజు ఉదయం కొనుగోలు చేసే పాలలోనూ వ్యాపారులు పిండి, రసాయనలు కలిపి కల్తీ చేస్తున్నారు. హోటళ్లలో గడ్డ పెరుగు పేరిట కల్తీ పెరుగు విక్రయిస్తున్నారు. 25 లీటర్ల పెరుగు తయారీకి కేవలం 25 లీటర్ల వెడినీళ్లలో రెండు మాత్రలు వేసి అరగంటలో పెరుగు తయారు చేస్తున్నారు. ఐస్‌క్రీంలలోనూ హానికరమైన రసాయనాలు వాడుతున్నారు.
జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు..
► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంత కాలంగా మురిగి పోయిన, నాణ్యతలేని అల్లం, వెల్లులితో అల్లం పేస్టు తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసు ఇటీవల దాడిచేశారు. యాజామానిపై కేసు నమోదు చేశారు.
► గుడిహత్నూర్ మండలంలో కల్తీ కారం, పసుపు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్‌పోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నమూనాలను సేకరించి కేసులు నమోదు చేశారు.
► ఐదు నెలల క్రితం నేరడిగొండ మడలంలోని వారసంతలో కొంత మంది వ్యాపారులు కల్తీ కారం, పసుపు, నూనె విక్రయిస్తుండగా వినియోగదారులు గుర్తించి గొడవ చేశారు. దీంతో వ్యాపారులు పారిపోయారు.
► జిల్లా కేంద్రంలో గతేడాది కల్తీ నూనె విక్రయిస్తున్న వ్యాపారీ నుంచి 4 వేల లీటర్ల నూనెను అధికారులు పట్టుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు.
నాలుగు జిల్లాలకు ఒకే ఆధికారి...
అహార భద్రత శాఖకు సంబంధించిన ఆధికారులు జిల్లాకు ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కలిపి ఒకే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. దీంతో కల్తీ నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. నాణ్యతలేని సరుకులు ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
కల్తీతో క్యాన్సర్ ముప్పు..
పసుపు, కారంలో వ్యాపారులు నికిల్, గిలాటిన్ అనే పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరంలో రక్తకణాలను దెబ్బతీస్తాయి. కడుపులో మంట, అల్సర్ వస్తుంది. ప్రా«థమిక దశలో చికిత్స అందకపోతే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కల్తీ వస్తువలకు దూరంగా ఉండాలి.
– రాథోడ్ రవికుమార్, పిల్లల వైద్యనిపుణుడు
చదవండి: దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా..
Comments
Please login to add a commentAdd a comment