సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన ఆర్థిక సహకారం అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం నిధుల్లో కేవలం 20 శాతం మాత్రమే వచ్చాయి.
2022–23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద రూ.53 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.11 వేల కోట్లే రావడం గమనార్హం. మరో ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇంకా 80శాతం నిధులు రావాల్సి ఉండగా, అందులో సగం రావడం కూడా అనుమానమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుపై వివక్ష
వాస్తవానికి, కేంద్రం నుంచి రెండు పద్దుల రూపంలో రాష్ట్రాలకు ఆర్థిక ఆసరా అందుతుంది. ఇందులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నుల్లో వాటా ఒకటైతే, వివిధ పథకాల అమలుకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరొకటి. ఈ రెండు పద్దులను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా కింద గత ఏడు నెలల్లో రాష్ట్రానికి రూ.5,911.06 కోట్లు (47.64 శాతం) వచ్చాయి.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది పన్నుల్లో వాటా కింద రూ. 12,407.64 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు అయితే పూర్తిగా వివక్షకు గురవుతోంది. ఈ పద్దు కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.41,001.73 కోట్లు వస్తాయని రాష్ట్రం అంచనా వేయగా.. అందులో కేవలం 13.64 శాతం అంటే... రూ. 5,592.66 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు కొదవే లేదు
తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దులో కోత పెడుతున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా మంజూరు చేస్తోంది. రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా, వాటి వార్షిక బడ్జెట్ పద్దు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా 35 నుంచి 80 శాతం వరకు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఇందులో గుజరాత్‌కు అయితే దాదాపు 80 శాతం నిధులు ఇచ్చేసింది.
కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశా, త్రిపుర... ఇలా ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి తెలంగాణ కంటే ఎక్కువగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం అందడం గమనార్హం. పన్నుల్లో వాటా కింద కూడా ఈ రాష్ట్రాలకు కేంద్రం.. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే పంపిందని కాగ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment