
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎవరూ నిరుత్సాహపడొద్దని, ఎదురుదెబ్బలు ఎదుర్కొని నిలబడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని టీపీసీసీ కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా, రాహుల్‌ల నాయకత్వానికి టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ నెల 14న భూదాన్ పోచంపల్లిలో ప్రారంభం కానున్న సర్వోదయ పాదయాత్ర, కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల ఖాళీల ప్రకటన, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, నేడు కొల్లాపూర్‌లో జరగనున్న ‘మన ఊరు–మన పోరు’ సభ, డిజిటల్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశం తర్వాత పార్టీ నేతలు అంజన్‌కుమార్, గీతారెడ్డి, అజ్మతుల్లాతో కలసి మధుయాష్కీ విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయంగా కష్టాలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదన్నారు. సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు హాజరయ్యారు.