సాక్షి, హైదరాబాద్: పదేళ్లలో ఎంత తేడా. కళకళలాడిన ఆర్టీసీ కనీవినీ ఎరుగని రీతిలో దెబ్బతింది. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకుంటూ, సమస్యలను అధిగమించుకుంటూ సాగితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ, ఏయేటికాయేడు పనితీరు పూర్తిగా దిగజారి చరిత్రలో ఎన్నడూ లేని దుస్థితికి చేరింది మన ఎర్ర బస్సు. ప్రస్తుతం కోవిడ్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అయిన తీరుకు ఆర్టీసీ మినహాయింపు కాదు. కానీ, కోవిడ్ పంజా విసరటానికి ముందు చేసిన ఆర్థిక మదింపు ఆర్టీసీ దీనావస్థకు అద్దం పడుతోంది. ఇటీవలే ముగిసిన శాసనసభ సమావేశాల్లో రవాణాశాఖ సభకు సమర్పించిన లెక్కలే ఇవి. పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుంటే, ఊహించని రీతిలో సంస్థ దెబ్బతిన్నదని స్పష్టమవుతోంది. 2011–12 నుంచి 2019–20 (కోవిడ్‌కు ముందు నాటికి) వరకు సంవత్సరం వారీగా వివరాలను ఇందులో పొందుపరిచారు.
2015 నుంచి మూడున్నర రెట్లు పెరిగిన నష్టం
ఈ పదేళ్ల కాలంలో 2014–15 వరకు పరిస్థితి ఒకరకంగా ఉంటే, 2015–16 నుంచి దారుణంగా మారిపోయిందని రవాణాశాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. 2011 నుంచి 2014 వరకు తెలంగాణ పరిధిలో గరిష్ట నష్టం రూ.299 కోట్లు మాత్రమే. ఇది 2014లో నమోదైంది. కానీ 2015లో ఆ మొత్తం ఏకంగా రూ.1,150 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత అది కాస్త తగ్గినా మళ్లీ 2019–20లో రూ.1,002 కోట్లుగా నమోదైంది. నష్టం దాదాపు మూడున్నర రెట్లు పెరగగా, ఆదాయం మాత్రం కనీసం రెట్టింపు కాలేదు.
2012లో స్థూల ఆదాయం రూ.3,409 కోట్లు ఉండగా, 2019–20లో రూ.4,593 కోట్లుగా చూపారు. నష్టాల పెరుగుదలకు, ఆదాయం పెరుగుదలకు ఎక్కడా పొంతనే లేకుండా పోయింది. 2011–12లో కి.మీ. స్థూల ఆదాయం రూ.25 ఉంటే స్థూల ఖర్చు రూ.27గా నమోదైంది. అంటే కేవలం కి.మీ.కు రూ.2 మాత్రమే తేడా ఉంది. అదే 2019–20లో కి.మీ. స్థూల ఆదాయం రూ.39.88గా ఉంటే ఖర్చు రూ.48.58గా ఉంది. అంటే ఆదాయానికి ఖర్చుకు తేడా రూ.9 వరకు నమోదవటం గమనార్హం.
తీవ్ర నష్టాల్లో... వేతన పెంపు ఎలా?
ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంది. 2013 నాటి వేతన సవరణ 2015లో అమలు చేశారు. కార్మిక సంఘాల డిమాండ్‌తో ప్రమేయం లేకుండా ఎవరూ ఊహించనట్టు ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఆర్టీసీపై దాదాపు రూ.850 కోట్ల వార్షిక భారం పడింది. కానీ, ఆదాయం పెంపునకు కనీస ప్రయత్నం జరగలేదు. దీంతో ఆర్టీసీకి వచ్చే అరకొర ఆదాయం కాస్తా వేతన సవరణ భారం ముందు నిలవలేక నష్టాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ వేతన సవరణ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే ప్రతినెలా ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన మొత్తం నుంచి జీతాలకు నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం 16 శాతం ఐఆర్ అమలవుతోంది. అంతమేరనే పెంచుతారా, ఇంకా పెరుగుతుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ ఆదాయం ఏరకంగానూ పెరిగే సూచనలు కనిపించటం లేనందున కొత్త వేతన సవరణకు ప్రభుత్వమే పూర్తిగా సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది.
తగ్గిన బస్సులు..
రోజులు గడిచేకొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఆమేరకు బస్సుల సంఖ్య కూడా పెరగటం కద్దు. కానీ తెలంగాణలో పరిస్థితి దానికి విరుద్ధంగా మారింది. 2011లో ఉన్న బస్సుల కంటే ఇప్పుడు తగ్గిపోయాయి. అప్పుడు 10,309 బస్సులుంటే ఇప్పుడు 9,691 బస్సులున్నాయి. పదేళ్ల కింద ఏడాదికి 116.71 కోట్ల కి.మీ. మేర బస్సులు తిరిగితే 2019–20లో 115.19 కోట్లే తిరిగాయి. అంటే బస్సుల సంఖ్యే కాకుండా అవి తిరిగే నిడివి కూడా తగ్గిపోయింది. 2011లో 1,681 కొత్త బస్సులను ఆర్టీసీ తెలంగాణ పరిధిలో సమకూర్చుకుంది.
2019–20లో ఆ సంఖ్య కేవలం 149 మాత్రమే. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌తో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్న సమయంలో, ఏపీ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ లక్షన్నర కి.మీ. అదనంగా తిప్పుకునే అంశం పరిశీలనకు వచ్చింది. అది జరగాలంటే కొత్త బస్సులను ఎక్కువగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో తాము పెంచుకోలేమని, అంతమేర ఏపీనే తగ్గించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది, అదే చేసింది. ఇలా బస్సుల సంఖ్య, తిరిగే కిలోమీటర్లు, సర్వీసుల సంఖ్య, రూట్ల సంఖ్య తగ్గుతూ పోతే ఆదాయం ఎలా పెరుగుతుందో ఆర్టీసీకే తెలియాలి.
రవాణా శాఖ నివేదిక ప్రకారం ఆదాయ, నష్టాల వివరాలు ఇలా.. (రూ.కోట్లలో)
సంవత్సరం 2011–12 2012–13 2013–14 2014–15 2015–16 2016–17 2017–18 2018–19 2019–20
స్థూల ఆదాయం 2863.87 3408.65 3742.93 3294.33 4336.30 4233.05 4570.37 4882.72 4592.93
నష్టం 282.99 5.48 209 299.64 1150.48 749.27 748.90 928.67 1002.02
Comments
Please login to add a commentAdd a comment