మలిసంధ్య వెలుగులో మహాస్థూపం
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ఈ త్రిరత్నాలు అక్కడ చెవులకు వినిపించలేదు, కానీ మనసుకు గుర్తుకు వచ్చింది. మన చెవుల్లో మార్మోగుతున్న భావనకు లోనవుతాం. బుద్ధవనం ఆవరణలో విహరిస్తున్నంత సేపే కాదు, ఆ తర్వాత కూడా ఒక స్వచ్ఛమైన భావన వెంటాడుతూనే ఉంటుంది. ఆ భావనను వర్ణించడానికి మాటలుండవు. ఎవరికి వాళ్లు లోనవ్వాల్సిందే. బుద్ధవనంలోకి ప్రవేశించగానే ధర్మచక్రం స్వాగతం పలుకుతుంది. ఎటు చూసినా బుద్ధుడు... బౌద్ధ చిహ్నాలు ఆహ్లాదాన్నిస్తాయి. కలువ కొలనులోని బుద్ధుని పాదాలకు పుష్పార్చన చేసి ముందుకు వెళ్తే శ్రీలంక బౌద్ధులు బహుమతిగా ఇచ్చిన ధర్మగంట కనిపిస్తుంది. మరో వైపు లుంబినీ వనంలో కాలావృక్షం, ఆ వృక్షం కింద సిద్ధార్థుడు పుట్టడం, పుట్టగానే ఏడు అడుగులు నడవడం లోహపు విగ్రహాల్లో కనిపిస్తుంది. సిద్ధార్థుడి దృష్టిని ఆకర్షించిన కుష్టు వ్యాధి గ్రస్తుడు, శవం, సన్యాసి మొదలైన వారిని చూసి విచలితుడు కావడం కనిపిస్తుంది. నీటి యుద్ధాన్ని నివారించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం దృశ్యరూపంలో ఉంటుంది.
గాంధార శిల్పరీతిలో ఉన్న మీసాల బుద్ధుడు
రోహిణి నది నేపాల్‌లోని కపిలవస్తులో పుట్టి, భారతదేశంలోకి ప్రవహించి ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ దగ్గర రాప్తి నదిలో కలుస్తుంది. వర్షాలు తక్కువగా కురిసిన ఏడాది పంటలకు సరిగా నీరందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలై, అది వివాదంగా మారింది. ఇరు వర్గాల్లో ఒకరు సిద్ధార్థుడి తల్లి వైపు వాళ్లు, మరొకరు తండ్రి వైపు వాళ్లు. శాంతికాముకుడైన సిద్ధార్థుడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఇరువురి మధ్య అంగీకారం కుదరకపోవడంతో యుద్ధం అనివార్యమవుతుంది. సిద్ధార్థుడిని అంతరయానంలోకి తీసుకెళ్లిన అంశాలివన్నీ. అలాగే ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి ముందు ఆత్మావలోకన స్థితిలో ఉన్న సిద్ధార్థుడు, ఎదురుగా అతడు ప్రయాణించే గుర్రం కంటక విగ్రహం కూడా ఉన్నాయి. సిద్ధార్థుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం కావడం, ఐదుగురు సన్యాసులకు ప్రవచనం ఇవ్వడం, పరిత్యాగం... ఇవన్నీ బుద్ధచరితవనంలో కనువిందు చేసిన దృశ్యాలు.
కష్ణానది తీరాన బుద్ధవనం ఏరియల్ వ్యూ
శ్రీలంక బుద్ధుడు
ధ్యానవనంలో 27 అడుగుల బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. తొలిచూపులో హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ బుద్ధుడు గుర్తు వస్తాడు. వెంటనే తేడా ఉన్నట్లు కూడా స్ఫురిస్తుంది. హుస్సేన్‌సాగర్ బుద్ధుడు అభయ హస్త ముద్రలో ఉంటే బుద్ధవనంలో కుడి చేతిని పైకి ఎత్తి అరచేతిని ఎడమవైపు తిప్పి ఉంటాడు. ఇది శ్రీలంక, అవునాక గ్రామంలో ఉన్న బుద్ధుని విగ్రహానికి ప్రతిరూపం. శ్రీలంక బౌద్ధ సన్యాసులు స్వయంగా బుద్ధవనానికి వచ్చి ఈ బుద్ధుని విగ్రహాన్ని తయారు చేశారు. బుద్ధవనంలో ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతక వనం (బోధిసత్వ పార్కు), స్థూపవనం, మహాస్థూపం, ధ్యానవనంలోని అవుకాన స్థూపం, లండన్ మ్యూజియంలో ఉన్న ఫలకాల ప్రతిబింబం 14 అడుగుల రాతి గోడ ‘రెయిలింగ్ ఎరీనా’ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. పంచశీల పతాకాలు గాలికి రెపరెపలాడుతుంటాయి.
జాతక వనంలో ఉన్న తొలి కథాశిల్పం
తెలంగాణలో విరిసిన బౌద్ధం
బుద్ధుడు పుట్టింది క్రీ.పూ 563లో. క్రీ.పూ 480 వరకు జీవించాడు. బుద్ధుడు నివసించిన కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వికసించింది. బావరి అనే సన్యాసి బుద్ధుడి గురించి విని, 16 మంది శిష్యులను మగధకు పంపించాడు. వైశాలిలోని వేణువనంలో బుద్ధుడి ప్రవచనాలు, బోధనలు జరిగేవి. 15 మంది అక్కడే ఉండిపోగా, పింగయ అనే శిష్యుడు మాత్రమే వెనక్కి వచ్చి బుద్ధుడి తత్వాన్ని తెలుగునేల మీద బోధించాడు. బుద్ధవనంలో ఉన్న ప్రతి నిర్మాణం బుద్ధుడికి సంబంధించిన ఏదో ఒక రిఫరెన్స్ ఆధారంగా రూపొందించినవే. జాతక కథలు, అజంతా, ఎల్లోరా గుహల్లో ఉన్న చిత్రాలు, శిల్పాలు, జనపదాల్లో వ్యవహారంలో ఉన్న కథలలోని ఘట్టాల ఆధారంగా రూపొందించిన కళాకృతులు ఇవన్నీ. 2006, జనవరిలో దలైలామా బుద్ధవనాన్ని సందర్శించినప్పుడు బుద్ధగయ నుంచి తెచ్చిన బోధి మొలకను నాటారు. అది ఇప్పుడు పెద్ద బోధివృక్షంగా మారింది.
సిద్ధార్థుని గుర్రం కంటక
మహా ప్రదక్షిణం
మహాస్థూపం అమరావతి స్థూపం నమూనాతో రూపొందింది. మహాస్థూపం లోపలకి అడుగుపెట్టడానికంటే ముందు స్థూపాన్ని ప్రదక్షిణగా చుట్టి వస్తే సిద్ధార్థుని పుట్టుక, వివాహం, ఇల్లు వదిలి వెళ్లడం, బోధివృక్షం కింద ధ్యానం, జ్ఞానోదయం, పరివ్రాజకులకు బోధనలు, మహాపరిత్యాగం వరకు, అలాగే తొలినాటి బౌద్ధం నుంచి సమకాలీన వజ్రయాన బౌద్ధం వరకు, బౌద్ధధర్మం సమాజానికి చేసిన దిశానిర్దేశం, అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించడం, బౌద్ధం మహాయానం, హీనయానంగా విభజనకు లోను కావడం, బుద్ధుడు చెప్పిన అహింస, సత్య ధర్మాన్ని గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాటించడం, అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకోవడం, భారత రాజ్యాంగం బౌద్ధం నుంచి ధర్మచక్రాన్ని, నాలుగు సింహాల చిహ్నాన్ని స్వీకరించడం వరకు బౌద్ధానికి చెందిన ముఖ్యమైన ఘట్టాలు కుడ్యశిల్పాలుగా ఉన్నాయి.
చరితవనంలో కొలువుదీరిన ధ్యానబుద్ధుడు
మీసాల బుద్ధుడు
మహాస్థూపం కింది అంతస్థులో గోపురం లోపలికి వెళ్తున్నప్పుడు ఎదురుగా ఆచార్య నాగార్జుడి విగ్రహం, కుడివైపు ఆర్కియాలజీ మ్యూజియం ఉన్నాయి. ఆ మ్యూజియంలో బుద్ధుడి చిత్రలేఖనాలు, రాతి శిల్పాలు, లోహపు శిల్పాలు, తల విరిగిన బోధిసత్వుడి విగ్రహం ఉన్నాయి. శిల్పాలు గాంధార, మధుర, అమరావతి శిల్పరీతుల్లో ఉన్నాయి. గాంధార శిల్పరీతిలో భుజాలు బలిష్టంగా, వస్త్రధారణ వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి గాంధార బుద్ధుడికి మీసాలు ఉన్నాయి. బుద్ధుడిని సౌమ్య మూర్తిగా చూస్తాం. ఈ బుద్ధుడు సౌమ్యంగా కనిపిస్తూనే రాజఠీవి ప్రదర్శిస్తుంటాడు.
దలైలామా నాటిన వృక్షం
మహాస్థూపంలో ఉన్న వైరోచన బుద్ధుడు
మరో లోకం
మహాస్థూపంలోకి అడుగుపెట్టేటప్పుడు కళ్లు మూసుకుని మౌనంగా లోపలికి వెళ్లి మెల్లగా కళ్లు తెరిస్తే... ఓ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కారమవుతుంది. మరోలోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. నిర్మాణ నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆకాశాన్ని అరచేతిలో ఇమిడ్చే ప్రయత్నం ఏదో జరిగినట్లు అనిపిస్తుంది. నీలిరంగులో మేఘావృతమైన ఆకాశాన్ని తలపించే పై కప్పు, మేఘావృతం కిందుగా పద్మం రెక్కల అమరిక అద్భుతమైన కౌశలం. ఒక్కో వరుసకు అరవై రెక్కలు, అలా 16 వరుసలున్నాయి. గోపురానికి మధ్యలో బంగారు రంగులో బుద్ధుడు మెరిసిపోతుంటాడు. నాలుగు దిక్కులకు నాలుగు విగ్రహాలు, ఈ నాలుగు దిక్కుల్లో ఉన్నది ఒకే రూపం. వైరోచన ధర్మచక్ర ప్రవర్తన బుద్ధుడు. నాలుగు మూలల్లో అమిత అభ, అక్షోభ్య, రత్నసంభవ, అభయముద్ర రూపాల్లో ఉంటాడు.
అవునాక బుద్ధుడు
జాతకవనం
బౌద్ధ జాతక కథలు మొత్తం 547. ప్రధానమైన 40 కథలను ఇక్కడ చూడవచ్చు. ఒక్కో కథ ఒక్కొక్క ఫలకం మీద చెక్కి ఉంటుంది. దీపాంకర కథతో మొదలై వెస్సంతర కథతో ముగిసింది. ఈ కథల్లో చిన్నప్పుడు చదువుకున్న కోతి– మొసలి కథ, శిబి చక్రవర్తి కథ, రిష్యశృంగుని కథ ఉన్నాయి. ఈ కథలకు అక్షరరూపం పక్కనే బోర్డులో ఉంటుంది. ఇక స్థూపవనం ప్రపంచంలోని బౌద్ధస్థూపాలన్నీ ఒక్కచోట కొలువుదీరినట్లుండే ప్రదేశం. ప్రతి ప్రముఖ బౌద్ధ స్థూపానికి నమూనా స్థూపాన్ని నిర్మించారు.
ధర్మచక్రం నమూనా శిల్పం
దశాబ్దాల శ్రమ
బుద్ధవనం ప్రాజెక్టు పనులు 2003లో మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 274 ఎకరాల్లో నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తున్న బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అష్టాంగమార్గాలకు ప్రతీక నిర్మాణాలలో చరితవనం, జాతక వనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. బుద్ధవనం పర్యటన మనసును సిద్ధ స్థితిలోకి తీసుకువెళ్తుందనడంలో సందేహం లేదు.
- వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment