
ఎంపీగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వద్దిరాజు రవిచంద్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 12 నుంచి 18 వరకు రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి నామినేషన్లు స్వీకరించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో సోమవారం ఉపసంహరణ గడువు ముగిశాక ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రవిచంద్ర సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
కాగా, తెలంగాణ కోటాలో వచ్చే నెలలో ఖాళీ అవుతున్న మరో 2 రాజ్యసభ స్థానాల కు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు ఉంది. సీఎం కేసీఆర్ ఈ రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులుగా బండి పార్థసారథిరెడ్డితో పాటు దీవకొండ దామోదర్‌రావు పేర్లను ఇప్పటికే ప్రకటించారు. వీరు బుధవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజ్యసభకు బండా ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలో తాజాగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నికయ్యారు. వచ్చే నెలలో రాజ్యసభ సభ్యులుగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి పార్థసారథిరెడ్డి, దామోదర్‌రావు నామినేషన్లు వేస్తారు.
జయశంకర్‌ను రేవంత్ కలిశారా?: ఎర్రబెల్లి
తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ కలసిరాని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎప్పుడూ దివంగత జయశంకర్‌ను కలవలేదని, కనీసం జేఏసీ సమావేశాలకు కూడా హాజరు కాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం అసెంబ్లీ ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జయశంకర్ తనకు గురువులాంటి వారని, ఆయన సొంత గ్రామాన్ని తామే అభివృద్ధి చేశామని చెప్పారు. జయశంకర్ మరణం తర్వాత ఆయన చిత్ర పటానికి పూలదండ వేయని రేవంత్ లాంటి మూర్ఖులు ఆయన గ్రామం అభి వృద్ధి గురించి విమర్శలు చేస్తున్నారన్నారు. రేవంత్ లాంటి వారు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment