
న్యూఢిల్లీ: ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. 187వ నిబంధన (సభా హక్కుల ఉల్లంఘన) కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి కలిసి నోటీసులో పేర్కొన్నారు. అదే విధంగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాజ్యసభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
కాగా మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన మోదీ, కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును తొందరపడి ఆమోదించిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి చర్చ జరపకుండానే ఫిబ్రవరి 2014 రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యతిరేకం కాదని చెబుతూనే, లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మైకులు కట్ చేశారని, తలుపులు మూసివేశారని, కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారని ప్రధాని ప్రస్తావించారు. దీని కారణంగా రెండు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు.
చదవండి: ‘మోదీ హేట్స్ తెలంగాణ’: రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment