![Telangana: Yadadri temple get Gold Dome Doors - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/19/18ALR204-230014_1_18.jpg.webp?itok=5X8nDS0I)
గర్భాలయ ద్వారానికి బంగారు తొడుగులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పసిడి వర్ణంలో కనువిందు చేయనుంది. ఈ మేరకు వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గర్భాలయ ద్వారం, ఆళ్వార్ మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తొడుగులు అమర్చారు. త్రితల, పంచతల, సప్త తల రాజగోపురాలపై స్వర్ణ కల శాలను బిగించారు. ఇక రాత్రి సమయంలో ఆలయమంతా బంగారు వర్ణంలో ధగధగ మెరిసేలా దీపాలు ఏర్పాటు చేశారు.
16 కిలోల బంగారంతో ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతంగా గర్భాలయ ద్వారాలను తీర్చిదిద్దారు. 36 రేకుల కమలాలు, 8 తామర పువ్వులను ఈ ద్వారంలో అమర్చారు. దీనికి రెండు వైపులా 14 నృసింహస్వామి ఆకృతులున్నాయి. మధ్యలో గంటలు, పైభాగంలో శంకు, చక్ర, నామాలను సైతం బంగారంతో తీర్చిదిద్దారు. బంగారు తొడుగులతో చేసిన ఈ డిజైన్ ఆలయంలో ఉండే స్థలాన్ని శక్తివంతం చేస్తుందని స్తపతులు, ఆచార్యులు పేర్కొన్నారు. శ్రీచక్ర యంత్రం వలే విశ్వశక్తిని సూచిస్తుందన్నారు.
రూ.9 కోట్లతో పనులు
నల్లని కృష్ణశిలకు అనుగుణంగా విద్యుత్ దీపాలు ఉండాలనే యోచనతో రూ.9 కోట్లతో పనులు చేస్తున్నారు. ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈఈ రామారావు ఆధ్వర్యంలో రష్యా, జర్మనీ కంపెనీల సహకారంతో బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ ఏజెన్సీ లైటింగ్ పనులు చేపట్టింది. ఆలయం లోపల, బయట గంటలు, తామరపువ్వు, బోలాడ్, ట్రైప్యాడ్స్, ఫ్లడ్ లైట్లను బిగించారు. ఇవి రాత్రి సమయంలో బంగారు వర్ణంలో కనువిందు చేస్తాయి. భక్తులు వెళ్లే క్యూలైన్లు సైతం స్వర్ణమయంగా ఉంటాయి. ఇండోర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అల్యూమినియం, ఇత్తడి మిశ్రమంతో చేసిన ఈ క్యూలైన్లను తూర్పు రాజగోపురం ముందు భాగంలో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment