సాక్షి, హైదరాబాద్/హుజూరాబాద్/ఇల్లందకుంట : కరీంనగర్ పోలీసు కమిషనరేట్ జాతీయ స్థాయిలో మరో గుర్తింపు సంపాదించింది. దీని పరిధిలోని జమ్మికుంట పోలీసుస్టేషన్ పదో ఉత్తమ ఠాణాగా ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన పది ఉత్తమ ఠాణాల జాబితాను కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) గురువారం విడుదల చేసింది. గతేడాది ఇదే కమిషనరేట్‌లో ఉన్న చొప్పదండి పోలీస్‌స్టేషన్ ఎనిమిదో స్థానం కైవసం చేసుకుంది. ఇటు జమ్మికుంట ఠాణా సిబ్బందిని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఠాణాను ఇతర పోలీస్‌స్టేషన్‌లు ఆదర్శంగా తీసుకోవాలని డీజీపీ సూచించారు.
2017 నుంచి ప్రారంభం..
2016లో జరిగిన డీజీపీల సదస్సులో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో 2017 నుంచి ‘ఉత్తమ పోలీస్‌స్టేషన్ల’గుర్తింపు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ఏడాది హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీసుస్టేషన్ రెండో స్థానంలో నిలి చింది. ఆ తర్వాతి ఏడాది రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ టాప్–10లో స్థానం సంపాదించలేకపోయినా.. 14వ స్థానంలో నిలిచింది.
వివిధ కోణాల్లో అధ్యయనం..
దేశ వ్యాప్తంగా పది ఉత్తమ పోలీసుస్టేషన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ ఏ.. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇం డియాకు అప్పగించింది. కేంద్రం అధీనంలోని ఈ విభాగం ప్రతి ఏడాదీ దేశంలోని అన్ని రా ష్ట్రాలు, కేంద్ర పాలి త ప్రాంతాల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది. ఈసారి వంద ల సంఖ్యలో వచ్చిన ఎంట్రీలను పరిగణనలో కి తీసుకున్న ఈ విభాగం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. వాటిలో జమ్మికుంట కూడా ఉంది. క్వాలిటీ కంట్రోల్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం ఈ ఏడాది ఆయా ప్రాంతాలకు చేరుకుని దాదాపు నెలన్నర పాటు రహస్యంగా షార్ట్‌లిస్ట్ చేసిన ఠాణాల పనితీరు, వాటిలోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఒక్కో పీఎస్ పరిధి నుంచి 100 మందిని ఎంపిక చేసుకుని వారి అభిప్రాయాలు తీసుకుంది. వీరిలో ఠాణాకు వచ్చిన బాధితులు, దాని చుట్టుపక్కల వారు, పోలీ స్‌స్టేషన్ పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి వివరాలు సేకరించింది.
క్లిష్టమైన ఎంపిక విధానం
క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఎంపిక విధానం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. తొలుత అభిప్రాయాలు సేకరించినప్పుడు కనీసం 80 శాతం మంది పోలీసుల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన బృందం ఆ ఠాణాకు సంబంధించి ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఆకస్మికంగా ఆ పోలీస్ స్టేషన్‌ను సందర్శించే బృంద సభ్యులు మౌలిక వసతులు, వాటి నాణ్యతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, నేరగాళ్లకు శిక్షలు పడుతున్న శాతం, రికవరీలతో పాటు ఠాణా పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంతో అక్కడి పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణ తీరు, ఫైళ్ల నిర్వహణ తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా చేపట్టిన సమగ్ర అధ్యయనం తర్వాత దేశంలో ఉత్తమంగా నిలిచిన 10 పోలీస్ స్టేషన్ల జాబితాను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా కేంద్ర హోంశాఖకు అందిస్తుంది.
బెస్ట్ ఠాణాగా జమ్మికుంట
Published Fri, Dec 4 2020 8:11 AM | Last Updated on Fri, Dec 4 2020 8:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment