సాక్షి, సిటీబ్యూరో: కేరళలోని తిరునల్వేలి జిల్లా మూలక్‌రాయ్‌పట్టిలో ఉన్న జ్యువెలరీ దుకాణంలో రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు చోరీ చేసి, నాలుగున్నర నెలలుగా పరారీలో ఉన్న రామకృష్ణన్‌ను అక్కడి పోలీసులు శనివారం సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆ సొత్తును తాను తల్లి మీనాక్షి వద్దే ఉంచానని చెప్పాడు. దీంతో ప్రత్యేక బృందం తిరునల్వేలి సమీపంలోని రెట్టార్కులం గ్రామంలోని వారి ఇంటిపై దాడి చేసి సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మీనాక్షి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.
అక్కడ చోరీ చేసి సిటీకి వచ్చి...
మూలక్‌రాయ్‌పట్టికి చెందిన వి.రెహ్మాన్ అక్కడే కొన్నేళ్లుగా జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోని రెట్టార్కులం గ్రామానికి చెందిన రామకృష్ణన్ ప్రైవేట్ ఉద్యోగి. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు కొన్నేళ్లుగా తిరునల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పట్టబడకపోవడంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. గత ఏడాది ఆగస్టులో ఇతడి కన్ను రెహా్మన్ నిర్వహిస్తున్న జ్యువెలరీ దుకాణంపై పడింది. ఆ నెల 22 రాత్రి షెల్డర్ పగులకొట్టి లోపలకు ప్రవేశించిన రామకృష్ణన్ 2.22 కేజీల బంగారం, రూ.3 లక్షల నగదు తస్కరించాడు. ఆ సొత్తును బయటకు తీయకుండా దాచి ఉంచి, కొన్నాళ్లు తన స్వస్థలానికి దూరంగా ఉంటే పోలీసులకు చిక్కనని భావించాడు.
స్నేహితుడిది అంటూ తల్లికి ఇచ్చు...
మర్నాడు దుకాణం తెరిచిన వెంటనే కనిపించిన సీన్‌తో తన దుకాణంలో జరిగిన చోరీ విషయం రెహా్మన్ గుర్తించాడు. దీనిపై మూలక్‌రాయ్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు కోసం తిరునల్వేలి ఎస్పీ నేతృత్వంలో తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. గుర్తించిన జ్యువెలరీ దుకాణం నుంచి తస్కరించిన నగదు తన వద్ద ఉంచుకున్న రామకృష్ణన్ బంగారం మాత్రం నేర్పుగా ప్యాక్ చేశాడు. రెట్టార్కులంలోని తల్లికి దీన్ని ఇచ్చి ఇంట్లో ఉంచాలని సూచించాడు. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడు కొన్ని విలువైన వస్తువులు ప్యాక్ చేసి, భద్రపరచాలని ఇచ్చాడంటూ ఆమెను నమ్మించాడు. నగదుతో గత ఏడాది ఆగస్టు 23న కేరళ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. హో టళ్లలో బస, ఖరీదైన మద్యం, ఆహారం, జల్సాలతో మూడు నెలల్లోనే రూ.3 లక్షలు ఖర్చు చేసేశాడు.
నిర్మాణం వద్ద కాపలాదారుడిగా పని...
దీంతో సికింద్రాబాద్‌లోని ఓ నిర్మాణం వద్ద కాపలాదారుడిగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. కనీసం ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుని ఆపై స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఆ తర్వాత తల్లి వద్ద ఉన్న సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. సికింద్రాబాద్‌లో కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న రామకృష్ణన్ దాన్ని వినియోగించి తల్లి మీనాక్షితో మాట్లాడటం మొదలెట్టాడు. మూలక్‌రాయ్‌పట్టి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామకృష్ణన్‌ను నిందితుడిగా గుర్తించాయి. అయితే అతడి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తల్లి ఫోన్‌పై నిఘా ఉంచాయి. ఆమెకు సికింద్రాబాద్‌లో ఉన్న నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నట్లు గుర్తించాయి. దీంతో శనివారం ఇక్కడకు వచి్చన ఓ స్పెషల్ టీమ్ రామకృష్ణన్‌ను పట్టుకుంది. ప్రాథమిక విచారణలోనే అతగాడు విషయాలన్నీ బయటపెట్టాడు.
తీవ్ర అవమానంగా భావించిన మీనాక్షి..
నిందితుడిని తీసుకుని కేరళ బయలుదేరిన పోలీసులు జ్యువెలరీ దుకాణంలో చోరీ చేసిన సొత్తు అతడి తల్లి వద్ద ఉందనే విషయాన్ని అక్కడి టీమ్‌కు చెప్పారు. దీంతో ఓ బృందం ఆదివారం ఉదయం రెట్టార్కులం గ్రామంలోని రామకృష్ణన్ ఇంట్లో దాడి చేసి 2.22 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతోనే తన కుమారుడు దొంగగా మారాడనే విషయం మీనాక్షికి తెలిసింది. దీనికి తోడు గ్రామంలో అందరూ చూస్తుండగా పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేయడం, చోరీ బంగారం రికవరీ చేయడాన్ని తీవ్ర అవమానంగా భావించింది. దీంతో పోలీసులు వెళ్లి కొద్దిసేపటిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుస్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్లిన ఆమె భర్త ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘సోమవారం రామకృష్ణన్‌ను రెట్టార్కులం తీసుకువెళ్లి మీనాక్షి అంత్యక్రియలు పూర్తి చేయించాం. ఆపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాం. అతడు ఇలాంటి మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానం ఉంది. కస్టడీలోకి తీసుకుని ఆ కోణంలో విచారిస్తాం’ అని తిరునల్వేలికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.
తిరునల్వేలిలో జ్యువెలరీ దుకాణాన్ని దోచేసిన రామకృష్ణన్
గత ఏడాది ఆగస్టులో చోటు చేసుకున్న ఈ భారీ దొంగతనం
సొత్తు తల్లికి ఇచ్చి నగరానికి వచ్చి ప్రైవేట్ ఉద్యోగిగా మకాం
సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న అక్కడి కాప్స్
అతడి ఇంటి నుంచి సొత్తు సీజ్,
అవమానంతో తల్లి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment