సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్
పోచారం: ‘వచ్చే డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు, మార్చిలో ఎన్నికలు, ఆపై కేసీఆర్ ఆత్మహత్య ఖాయం. తొందర్లోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుంటాడు’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశదిమ్మరిలా.. కాలు కాలిన పిల్లిలా.. చెట్టు మీద కోతిలా దేశమంతా తిరుగుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు’అని మండిపడ్డారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో తుపాకుల కాల్పులు, మహబూబ్‌నగర్‌లో మంత్రులను చంపాలనే కుట్ర వంటి ప్రతి సంఘటనలో టీఆర్‌ఎస్ నాయకుల పాత్రే ఉందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో పంపకాల లొల్లితో ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నారని, కేసీఆర్ ఇంట్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అప్పనంగా గుంజుకుం టోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములకు యజమానులను చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ విద్యా కేంద్రంగా మారుస్తామని చెప్పారు.
కాంగ్రెస్ సర్కారులో సభ్యులకే తొలి ప్రాధాన్యం
లక్షా 30 వేల కాంగ్రెస్ సభ్యత్వాల నమోదుతో మం చిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం మొదటి స్థానం లో, 92 వేలతో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచాయని రేవంత్ చెప్పారు. 30 లక్షల సభ్యత్వాలను డిజిటల్ పద్ధతిలో చేస్తామని సోనియాగాంధీకి చెప్పి 40 లక్షలు చేయగలిగామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించగలిగితే 90 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కార్యకర్తలే కథానాయకులవుతారని,చెప్పారు. చివర్లో స్థానిక నాయకులను సత్కరించకుండానే ఆయన సభాస్థలి నుంచి నిష్క్రమించడంతో కొందరు కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment