హైదరాబాద్ మహా నగరంలో అర గంట ప్రయాణం చేస్తే చాలు... ‘అబ్బో! ఎంత వాయు కాలుష్యం’ అంటూ గాభరా పడని వాళ్ళుంటారా? ఇంటి నుంచి బయటకొస్తే చెవులు చిల్లులు పడుతున్నాయని ‘ధ్వని కాలుష్యం’ గురించి చెప్పని వాళ్ళుంటారా? కానీ, సిటీ ఈ చివర్నుంచి.. ఆ చివరి వరకూ అడుగుడుగునా కనిపించే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితేమిటి? తెల్లటి షర్ట్‌తో బయటకెళ్ళిన ఆ వ్యక్తి గంటలో నల్లగా మసిబారిపోవడం రోజూ మనం చూస్తున్నదే.
కంటికి కన్పించే ఈ నిజం వెనుక కొన్ని కఠోర సత్యాలున్నాయి. వాయు కాలుష్యం వల్ల ట్రాఫిక్ పోలీసుల్లో 32 శాతం మంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారట. ధ్వని కాలుష్యం వల్ల 25 శాతం మంది వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారట. మరో 7 శాతం మంది సర్వీసులో ఉండగానే తీవ్రమైన దృష్టి లోపానికి గురవుతున్నారట. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్, ఒకప్పటి నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సీవీ ఆనంద్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికలోని పరిశీలనలివి.
హైదరాబాద్ లో 3,236 ట్రాఫిక్ పోలీసులు అనుదినం విధుల్లో ఉంటారు. ఇందులో 19 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 77 మంది ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఏఎస్‌ఐలు, 172 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 846 మంది కానిస్టేబుళ్ళు, 1276 మంది హోం గార్డులూ ఉన్నారు. సీవీ ఆనంద్ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ నగర పరిధిలో 585 ట్రాఫిక్ జంక్షన్లుంటే, ఇందులో చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, మదీనా, మొజాంజాహి మార్కెట్, లక్డీకాపూల్, సంజీవరెడ్డి నగర్ జంక్షన్లలో అత్యధికంగా వాయు, ధ్వని కాలుష్యం ఉంది. మరో 200 ట్రాఫిక్ జంక్షన్లలో కాలుష్యం మధ్యస్తంగా ఉన్నట్టు గుర్తించారు.
రంగారెడ్డి సహా హైదరాబాద్ సిటీ 625 కిలో మీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ 70 లక్షల మంది నివసిస్తుంటే.. వచ్చిపోయే జనాభాను కలుపుకుంటే నగర జన సంచారం కోటి వరకూ ఉంటుంది. ఒకప్పుడు పరిమితంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు అన్ని వైపులా విస్తరించింది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నాయి. హిమాయత్ సాగర్ మొదలు కొని మాదాపూర్, అమీర్‌పేట వరకూ ఐటీ హబ్ ఊహించని విధంగా విస్తరించింది.
రవాణాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ప్రజలు ప్రతిరోజూ వెయ్యి వాహనాలు కొంటున్నారు. నగరంలో తిరిగే వాటిల్లో 70 శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. నగరంలో వాహనాలు రోజూ 2.4 మెగా లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి. 50 శాతానికిపైగా వాహనాలు కాలుష్యం వెదజల్లుతున్నాయని తేలింది. పీఎం 10 మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్‌లో కాలుష్యాన్ని కొలుస్తారు. ఇది 60 వరకూ ఉంటే సాధారణంగా భావిస్తారు. కానీ నగరంలో 2008లోనే ఇది 85.684 ఉంటే, 2018 నాటికి 108.75కు చేరింది. 2021 నాటికి ఇది 200కు చేరువలో ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసులను శ్వాసకోశ, ఊపిరితిత్తులు, క్యాన్సర్ బారిన పడేస్తున్నాయని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. – వనం దుర్గాప్రసాద్
నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్యం (మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్)
ప్రాంతం | 2008 | 2016 | 2018 |
బాలానగర్ | 107 | 131 | 165 |
జూబ్లిహిల్స్ | 50 | 108 | 143 |
శామీర్‌పేట్ | 51 | 73 | 63 |
కూకట్‌పల్లి | 85 | 89 | 160 |
సైనిక్‌పురి | 59 | 81 | 93 |
రాజేంద్రనగర్ | 38 | 68 | 61 |
నాచారం | 87 | 112 | 124 |
కేబీఆర్‌ఎన్ పార్క్ | 49 | 58 | 104 |
జూపార్క్ | 111 | 117 | 182 |
చదవండి: మరో రెండ్రోజులు చలి!
Comments
Please login to add a commentAdd a comment