Covid Treatment At Home In Telugu: Remedies And Treatment Of Covid-19 At Home - Sakshi
Sakshi News home page

Covid 19 Precations: ఈ జాగ్రత్తలు పాటించు.. కోవిడ్‌ను జయించు!

Published Sat, Jan 22 2022 2:39 AM | Last Updated on Sat, Jan 22 2022 10:42 AM

Treating COVID-19 At Home: Care Tips For You And Others - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. 60 శాతం మంది అసింప్టమాటిక్‌గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు కలిగిన వారు హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) మార్గదర్శకాల్లో సూచించింది. అంటే కరోనా పాజిటివ్‌ వస్తున్నవారిలో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, సీనియర్‌ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు వేగం ఎక్కువని, ఇంట్లో ఒకరికి వస్తే తక్కువ సమయంలోనే కుటుంబ సభ్యులకూ సోకే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. 

ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి 

  • కోవిడ్‌ పాజిటివ్‌గా తేలినవారు తక్షణమే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవడం మంచిది. 
  • ఇంట్లో వసతిని బట్టి ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండాలి. వసతి లేనివారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో చేరొచ్చు.  
  • ఇరుకు గదులు, రెండే గదులున్న ఇళ్లలో ఐసోలేషన్‌ పాటించడం కాస్త కష్టమే. తప్పనిసరి అయితే ఒక మూలన 6/6 అడుగుల విస్తీర్ణం కవరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఇంట్లోని వారందరూ తప్పకుండా మాస్కు ధరించాలి. ఆరు అడుగుల భౌతికదూరాన్ని పాటించాలి. క్లాత్‌ మాస్కు అయితే రెండు లేయర్లు ఉండేవి వాడాలి. వాటిని ప్రతి 4 గంటలకోసారి శుభ్రం చేసుకోవాలి. ఎన్‌–95 మాస్క్‌ అయితే రోజంతా వాడొచ్చు. ఇంట్లోకి మంచి వెలుతురు, గాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. 
  • లక్షణాలు లేని వారైతే విటమిన్‌ ట్యాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుంది. లక్షణాలున్నవారు మాత్రం తప్పకుండా వైద్యుడిని ఫోన్‌లోగానీ, వీడియోకా ల్‌ ద్వారా గానీ సంప్రదించి చికిత్స తీసుకోవాలి. 
  • ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌తో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతులో గరగర లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. 
  • బాధితులు తరచూ గోరువెచ్చని నీటితో పుక్కిలించడం చేయాలి. వీలైతే గోరువెచ్చని నీటినే తాగడం మంచిది. 
  • తాజా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆర్థిక స్తోమతను బట్టి డ్రైఫ్రూట్స్, ఇతర పళ్లు, రోజుకొక ఉడికించిన కోడిగుడ్డు తీసుకోవచ్చు. మంచి ఆహారం, విశ్రాంతితో రోగనిరోధక శక్తి బలపడుతుంది. కోవిడ్‌ను సులభంగా జయించవచ్చు.
  • పరిశుభ్రత పాటించాలి. ఉతికిన బట్టలు వేసుకోవాలి.
  • ఏడు రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. తర్వాత ఎలాంటి లక్షణాలు లేకుంటే మళ్లీ కోవిడ్‌ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్షణాలుంటే.. పరీక్ష చేయించి నిర్ధారించుకోవాలి. మళ్లీ పాజిటివ్‌ వస్తే మరికొంత కాలం ఐసోలేషన్‌లో ఉండాలి. 

సరైన ఆహారం తీసుకోవడం కీలకం 
కోవిడ్‌ వ్యాప్తి చెందుతున్న వారిలో చాలా మందికి ఆహారాన్ని తీసుకోవాలనిపించడం లేదు. ఆకలిగా ఉన్నప్పటికీ తినాలనే ఉత్సాహం లేకపోవడంతో ఇన్‌టేక్‌ తక్కువగా ఉంటుంది. ఇది ప్రమాదకరం. రోజుకు 3 పూటలా తాజాగా వండిన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. మెనూలో మార్పులు లేకున్నా ఇంట్లో రోజువారీగా తీసుకునే ఆహారాన్ని కడుపునిండా తినాలి. సరైన ఆహారం తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే. – డాక్టర్‌ హెప్సిబా, 
మెడికల్‌ ఆఫీసర్, హైదరాబాద్‌  

కోలుకున్నవారు సపర్యలు చేయొచ్చు.. 
ఇంట్లో ఒకరికి కోవిడ్‌ వస్తే.. ఇతరులకు సొకే అవకాశం ఉంటుంది. ఒకరికి హోం ఐసోలేషన్‌ పూర్తయ్యాక కుటుంబంలో ఇంకొకరికి వైరస్‌ సోకొచ్చు. అలాంటప్పుడు ఐసోలేషన్‌ ముగిసినవారు ఇతర బాధితులకు సపర్యలు చేయొచ్చు. అయినా భౌతికదూరం పాటించడం మంచిది. 

ఒక ఇంట్లో తల్లిదండ్రులిద్దరికీ కోవిడ్‌ వస్తే పిల్ల లకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు నెగెటివ్‌ వచ్చినా జాగ్రత్తలు పాటించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement