సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై టీఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి అవకాశమిస్తామని మూడు రోజుల కింద తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే బహుళ నాయకత్వమున్న నియోజకవర్గాల్లో ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
తొలి నుంచీ టీఆర్‌ఎస్‌లో ఉన్న, ఇటీవలకాలంలో చేరిన ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ‘కారు’ఓవర్‌లోడ్ అయిన పరిస్థితుల్లో టికెట్ దక్కే అవకాశం లేనివారి స్పందన ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. అలాంటి వారిపై టీఆర్‌ఎస్ పెద్దలు ఓ కన్నేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాము పార్టీ అధినేతను నమ్ముకుని ఉన్నామని, తమకు న్యాయం చేస్తారని టికెట్ ఆశిస్తున్న ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పేర్కొనడం గమనార్హం.
2018లోనూ ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ కొందరు సిట్టింగ్‌లను తప్పిస్తారనే ఆశాభావం కొందరి నేతల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ వారసులను వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున ఆరంగేట్రం చేయించాలనే ఆశతో ఉన్నారు. సిట్టింగ్‌లకే టికెట్లు అనే కేసీఆర్ ప్రకటన వారసుల రంగ ప్రవేశంపై ఎంత మేర ప్రభావం చూపు తుందనే చర్చ కూడా జరుగుతోంది.
కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే?
మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు తీసుకున్న టీఆర్‌ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీనిని కొనసాగించే అవకాశముంది. కమ్యూనిస్టు పార్టీలకు గణనీయ ఓటు బ్యాంకు ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో అరడజను నుంచి పది స్థానాల వరకు సీపీఐ, సీపీఎం కోరే అవకాశమున్నట్టు సమాచారం. పదేళ్లుగా తెలంగాణ అసెంబ్లీలో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం లేదు.
దీనితో ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధిర, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడెం లేదా హుజూర్‌నగర్‌ను సీపీఎం.. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెంతోపాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాలను సీపీఐ కోరే అవకాశముందని అంచనా. మధిర మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో తమ భవిష్యత్తు ఏమిటనే బెంగ కనిపిస్తోంది.
104 మందిలో ఎందరికి మంగళం?
శాసనసభలో 119 మంది సభ్యులకుగాను టీఆర్‌ఎస్ వారే 104 మంది ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవగా.. తర్వాత ‘రాజకీయ పునరేకీకరణ’పేరిట కాంగ్రెస్ నుంచి 12, టీడీపీ నుంచి ఇద్దరు, ఏఐఎఫ్‌బీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్కరు చొప్పున టీఆర్‌ఎస్ గూటికి చేరారు. దాంతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం 104కు చేరింది.
అయితే సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక) మరణం, ఈటల రాజేందర్ (హుస్నాబాద్) రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్ నగర్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు) రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచి 104 మార్క్‌ను నిలబెట్టుకుంది.
ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే టికెట్ల కేటాయింపు!
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఎన్నికల నాటికి పనితీరు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని ఆశావహులు భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన తనకు టికెట్ దక్కుతుందనే విశ్వాసాన్ని ఓ మాజీ మంత్రి వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే లేదా ఎంపీగా అవకాశమిస్తానని పార్టీ అధినేత హామీ ఇచ్చినందునే మళ్లీ తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వచ్చినట్టు ఓ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నారు.
మొత్తంగా మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చేందుకు కార్యాచరణ ప్రారంభించిన కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తారని అంచనాలు వేసుకుంటున్నారు. ఈసారి 25 నుంచి 30 మంది సిట్టింగ్‌లకు అవకాశం దక్కకపోవచ్చని టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిఘా సంస్థలు, సర్వేలు, ప్రశాంత్ కిషోర్ ‘ఐప్యాక్’ఫీడ్‌బ్యాక్ నివేదికలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారని.. ఎన్నికల నాటికి తుది నిర్ణయం తీసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
వలసలతో పోటీ తీవ్రం
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య టికెట్ల పంచాయితీ సాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి– మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), పైలట్ రోహిత్‌రెడ్డి– పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్దన్‌రెడ్డి– మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), కందాల ఉపేందర్‌రెడ్డి– మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు) మధ్య విభేదాలున్నాయి.
►మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ (మహబూబాబాద్), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ స్థానం) ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్లు ఆశిస్తున్నారు.
►2018లో ఓటమి పాలైన టీఆర్‌ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), పుట్ట మధు (మంథని), కోరం కనకయ్య (ఇల్లందు), లింగాల కమలరాజ్ (మధి ర)లకు జెడ్పీ చైర్‌పర్సన్లుగా, మధుసూదనాచారి (భూపాలపల్లి)కి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఈసారి వారు పోటీకోసం సిద్ధమవుతున్నారు.
►ఇక 2018లో ఇతర పార్టీల తరఫున పోటీచేసి ఓడిన అభ్యర్థులూ తర్వాత టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. వారి లో బోర్లకుంట వెంకటేశ్ నేత (చెన్నూరు), నామా నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీలుగా ఎన్నికకాగా.. వద్దిరాజు రవిచంద్ర (వరంగల్ పశ్చిమ)కు రాజ్యసభ సభ్యుడిగా, పాడి కౌశిక్‌రెడ్డికి (హుజూరాబాద్) ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.
రావుల శ్రీధర్‌రెడ్డి (బీజేపీ), ఆకుల లలిత (ఆర్మూరు)తోపాటు కేసీఆర్‌పై పోటీచేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్) తదితరులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీచేసిన ఓడిన బూడిద భిక్షమయ్య (ఆలేరు), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్), రత్నం (చేవెళ్ల) తదితరులు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment