గుజరాత్‌తోపాటే రాష్ట్రంలో ఎన్నికలు  | Telangana: Revanth Reddy Predicts Early Polls In Telangana | Sakshi
Sakshi News home page

గుజరాత్‌తోపాటే రాష్ట్రంలో ఎన్నికలు 

Published Tue, Oct 19 2021 2:38 AM | Last Updated on Tue, Oct 19 2021 2:38 AM

Telangana: Revanth Reddy Predicts Early Polls In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోవని సీఎం కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్‌తో పాటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్‌ను ఎవరు అడిగినట్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో రేవంత్‌ ఇష్టాగోష్టి మాట్లాడారు.

అసెంబ్లీ టికెట్లు సజావుగా ఇచ్చే పరిస్థితి టీఆర్‌ఎస్‌లో లేదని, ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు అప్రమత్తం కావొద్దనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలు ఉండబోవని కేసీఆర్‌ చెబుతున్నారని వివరించారు. 2022 ఆగస్టు 15తో దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇది కొత్త శకానికి నాంది అంటూ కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. గుజరాత్‌ ఎన్నికల సమయానికి తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్‌ రద్దు చేస్తారని, టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతమేనని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాన్ని నడపాల్సిన సమయంలో పార్టీపై కేసీఆర్‌ దృష్టి పెడుతున్నది కూడా అందుకోసమేనని చెప్పా రు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నా రు. ఆ భయంతోనే పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభలు పెడుతున్నారని రేవంత్‌ ప్రశ్నించారు. హరీశ్‌రావును కూడా త్వరలోనే పార్టీ నుంచి బయటకు పంపుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ప్రజల మీద సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం అలవాటని, వారు అప్రమత్తంగా లేనప్పుడు దాడులు చేస్తారని చెప్పారు.  

గెలిచినా ఓడినా లాభం లేదు 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచినా ఓడినా ఎవరికీ లాభం లేదని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ సహకారం బీజేపీకి ఉంటుందని, తనపై కేసులు పెట్టకుండా, దాడులు చేయకుండా అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 

దళితులకేదీ ప్రాధాన్యం? 
టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని ఉందని, అయినా వారిని మోసం చేశారని విమర్శించారు. దళితబంధు కూడా ఎవరూ అడగలేదని, దళితులు అడిగింది ఎస్సీల వర్గీకరణ అని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీని ఎన్నిసార్లు కలిసి అడిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ దళిత ద్రోహి అని, టీఆర్‌ఎస్‌లో దళితులకు ప్రాధాన్యం లేదని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ నామినేషన్‌ వేసే సమయంలో ఒక్క దళిత నాయకుడు లేడని, ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కూడా ఒక్క దళిత నేతను వేదికపై కూర్చోబెట్టలేదని విమర్శించారు. దళితద్రోహి కేసీఆర్‌ నాయకత్వంలో దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరారని రేవంత్‌ ఎద్దేవా చేశారు.  

తెలంగాణలో కాంగ్రెసే ప్రత్యామ్నాయం 
ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే ప్రత్యామ్నాయమని రేవంత్‌ అన్నారు. తమ సభలు, సమావేశాలు చూసిన తర్వాతే కేసీఆర్‌ విజయగర్జన సభ పెడుతున్నారని, ఆయన బయటకు రాక తప్పని పరిస్థితిని కాంగ్రెస్‌ కల్పించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6 కాబట్లే 15న సభ పెడుతున్నారని, తన లక్కీ నంబర్‌ 9 కాబట్టి డిసెంబర్‌ 9న సభ పెడుతున్నామని చెప్పారు. 2014లో టీడీపీ, బీజేపీ సాధించిన ఓట్లను 2023లో బీజేపీ తెచ్చుకోలేదని జోస్యం చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement