సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌ను సిట్ అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల విచారణకు కోర్టు అనుమతించడంతో ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఇక్కడే సిట్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటైంది. ‘ఫామ్‌హౌస్’వ్యవహారంలో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ కీలకమని భావిస్తున్న అధికారులు అతడిపైనే ఎక్కువగా దృష్టి సారించారు.
హరియాణాలోని ఫరీదాబాద్ సెక్టార్ 31లో ఉన్న ప్లాట్ నం.229లోని విలాసవంతమైన నాలుగు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఇతడు నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇంట్లోకి ఆయన ఇటీవలే గృహప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. సమీపంలోని శ్రీకృష్ణ–నవగ్రహ ఆలయంలో పూజారిగా చెలామణి అవుతున్న ఇతడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? దీనికీ, ఎమ్మెల్యేలకు ఎర అంశానికి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ సిట్ దర్యాప్తు సాగుతోంది. అనేక మంది ప్రముఖులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో సిట్ రామచంద్ర భారతిని ప్రశ్నించింది. ఎవరి ప్రోద్బలంతో ఫామ్‌హౌస్ మీటింగ్‌కు వచ్చారు?. ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్ల వరకు వెచ్చింది ఖరీదు చేయడానికి అంత మొత్తం ఎక్కడ నుంచి రానుంది? దాన్ని ఇవ్వడానికి ఎవరు ముందుకొచ్చారు? అనే అంశాలపైనా ప్రశ్నించింది. కోడ్ భాషలో జరిగిన చాటింగ్‌లు, వాటికి సమాధానం ఇచ్చిన అవతలి వ్యక్తులు.. తదితర అంశాలను నిందితుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క పోలీసులు రామచంద్రభారతి నుంచి రెండేసి చొప్పున ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు స్వాధీనం చేసుకున్నారు.
వేర్వేరు పేర్లు, చిరునామా, ఒకే ఫొటోతో ఉన్న ఇవి ఎలా వచ్చాయనేది ఆరాతీశారు. నిందితులకు సంబంధించిన అడియో, వీడియో సంభాషణలను విశ్లేషించిన అధికారులు కస్టడీలో వీరి నుంచి సేకరించాల్సిన వివరాలకు సంబంధించి 42 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని తయారు చేసుకున్నారు. ఈ ప్రశ్నలపై ముందుగా గురువారం ఉదయం ఒక్కొక్కరిని వేర్వేరుగా ప్రశ్నించారు.
మధ్యాహ్నం తరువాత అందరిని కలిపి ఈ ప్రశ్నలపై సమాధానాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే అందులో 17 ప్రశ్నలకు సంబంధించిన సరైన సమాధానాలు రాలేదు. ఒక్కొక్కరు ఒకో రకంగా మాట్లాడారు. వీటిపై శుక్రవారం జరిగే విచారణలో పోలీసులు స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ 17 ప్రశ్నల్లో నిందితులు చెప్పిన సమాధానాలతో మరిన్ని సందేహాలు పోలీసులకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా మరిన్ని ప్రశ్నలను పోలీసులు తయారు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిందితుల విచారణకు కోర్టు అనుమతించడంతో న్యాయవాది సమక్షంలో విచారణ పూర్తి అయిన తర్వాత ముగ్గురు నిందితులనూ చంచల్‌గూడ జైలుకు తరలించారు. శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.
సిట్ అధికారుల ప్రత్యేక సమావేశం...
సిట్ ఏర్పాటైనా దానికి పోలీసుస్టేషన్ హోదా లేకపోవడంతో కేసు రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని మొయినాబాద్ ఠాణాలోనే ఉంది. ఏసీబీ కోర్టు సైతం నిందితులను ఆ పోలీసులకే అప్పగించింది. ఈ కారణంగానే ప్రస్తుతానికి ఏసీపీ ఆఫీస్‌నే సిట్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. గురువారం డీసీపీలు కల్మేశ్వర్ సింగెన్వర్, జగదీశ్‌రెడ్డి, ఏసీపీ గంగాధర్, ఇన్‌స్పెక్టర్ లక్ష్మీరెడ్డి విచారణలో పాల్గొన్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ అధికారులంతా గురువారం నగరంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సిట్‌లో మూడు విభాగాలను ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. నిందితుల విచారణ, ఇతర రాష్ట్రాలు/ప్రాంతాల్లో దర్యాప్తునకు ఓ బృందం, సాంకేతిక అంశాల దర్యాప్తునకు మరోటి ఏర్పాటు చేయనున్నారు.
అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాల విశ్లేషణకూ ఓ బృందం పని చేయనుంది. సిట్‌లోకి మరికొందరిని తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నియామకాలు పూర్తైన తర్వాత సిట్ కోసం ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. సిట్ సమావేశాలు, నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు తదితరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment