
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బీఎల్ సంతోష్‌కు ఈనెల 16 నుంచి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. చివరకు ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆఫీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని కోర్టుకు చెప్పారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు.
మరోవైపు బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా ధిక్కరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రామచందర్‌రావు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో బీఎల్ సంతోష్ 41 సీఆర్‌పీసీని సవాల్ చేయాలనుకుంటున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ ముందు హాజరయ్యేందుకు బీఎల్ సంతోష్ గడువు కోరుతున్నారా? అని అడిగింది దీనికి బదులిస్తూ.. బీఎల్ సంతోష్ సిట్‌కు లేఖ రాశారని రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారో లేఖలోనే చెప్పారని వివరించారు.
బీఎల్ సంతోష్ తనకు ఇష్టమున్న సమయంలో విచారణకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే ప్రమాదముందని ప్రభుత్వం తరఫు న్యాయవాదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ జరుపుతామని చెప్పింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:30కి కోర్టు వాయిదా వేసింది. అయితే సాయంత్రానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు రావచ్చని న్యాయవాదులు భావిస్తున్నారు.
చదవండి: కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment