సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించింది. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర్ సుమలత గురువారం విచారణ జరిపారు. సీబీఐ తరఫున పీపీ నాగేంద్రన్ వాదనలు వినిపిస్తూ.. ‘గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు.
వివేకా వద్ద డ్రైవర్‌గా పనిచేస్తానని, హత్య చేయలేనని చెప్పినా గంగిరెడ్డి రూ.40 కోట్లు ఇస్తానని ఆశ చూపాడని దస్తగిరి (ఏ–2) వాంగ్మూలంలో వెల్లడించాడు. పథకం ప్రకారం ముందుగా వివేకా ఇంటికి వెళ్లిన గంగిరెడ్డి.. ఆ తర్వాత ముగ్గురు నిందితులు లోపలికి వచ్చేందుకు సహకరించాడు. గంగిరెడ్డి ఆదేశాలతోనే హత్యను వేరేవాళ్లపై నెట్టేలా చావుబతుకుల్లో ఉన్న వివేకా లేఖ రాశారు. అతని విచారణ తప్పనిసరి. వివేకా హత్య జరిగిన రోజు వాచ్‌మెన్ రంగన్న ఇతర నిందితులతో పాటు గంగిరెడ్డిని కూడా గుర్తించాడు. హత్య తర్వాత గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి సాక్ష్యాలను చెరిపివేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి’ అని వాదించారు.
చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?
డీఫాల్ట్ బెయిల్‌ను మెరిట్ ఆధారంగా పరిశీలించి రద్దు చేయవచ్చని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని గంగిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వెల్లడించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను కడప కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేశాయని చెప్పారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదన్నారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.
దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు (ఏ–4) షేక్ దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దస్తగిరిని అప్రూవర్‌గా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొట్టివేయాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు.
భాస్కర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిస్తూ.. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కిరాయి హంతకుడు దస్తగిరికి క్షమాబిక్ష చెల్లదని అన్నారు. ఈ పిటిషన్లలో ప్రతివాది అయిన దస్తగిరికి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో నిందితుడు దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment