ఇదీ ఐసెట్‌ ప్రవేశాల షెడ్యూల్‌..! | TS ICET 2020 Counselling Schedule Released | Sakshi
Sakshi News home page

6 నుంచి ఐసెట్‌ ప్రవేశాలు

Published Thu, Dec 3 2020 8:01 AM | Last Updated on Thu, Dec 3 2020 8:13 AM

TS ICET 2020 Counselling Schedule Released - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీలను ఆదేశించింది. కరోనా కారణంగా ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఆలస్యమైనందునా ఇప్పటివరకు ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించలేదు.

అయితే ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు యూనివర్సిటీలు అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాలను వెల్లడించాయి. అయితే ఇప్పటికీ కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థుల మెమోల ముద్రణ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానంపై మండలి దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను (ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్లలోని మిగతా సెమిస్టర్లకు సంబంధించిన బ్యాక్‌లాగ్స్‌ సహా) పూర్తి విద్యార్థుల సమగ్ర డేటాను సీడీల రూపంలో ఇవ్వాలని ఆదేశించింది. దీంతో యూనివర్సిటీలు ఆ డేటాపై కసరత్తు చేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీల నుంచి డేటా వస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.     – సాక్షి, హైదరాబాద్‌

మిగతా సెట్‌లకు వెనువెంటనే.. 
ఇటు ఐసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముగిసిన వెంటనే ఎడ్‌సెట్, లాసెట్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఒక్కొక్క నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా డిగ్రీ రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన (బ్యాక్‌లాగ్స్‌ లేకుండా) విద్యార్థులందరికీ మొదటి దశ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని వివరించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో తరగతుల ప్రారంభానికి చర్యలు చేపడతామని తెలిపారు. మరోవైపు బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయా విద్యార్థులకు కూడా చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మొత్తానికి ఈ నెలాఖరులోగా ప్రవేశాలు అన్నింటినీ పూర్తి చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రవేశాల కోసం 90 వేల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎడ్‌సెట్‌లో 29,861 మంది, లాసెట్‌లో 16,572 మంది, ఐసెట్‌లో 41,506 మంది అర్హత సాధించారు. పీఈసెట్‌లోనూ మరో 6 వేల మంది వరకు అర్హత సాధించారు. వారందరికీ త్వరలోనే ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 

ఇదీ ఐసెట్‌ ప్రవేశాల షెడ్యూల్‌.. 

  • 6–12–2020 నుంచి 11–12–2020 వరకు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ 
  • 8–12–2020 నుంచి 12–12–2020 వరకు: స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 
  • 8–12–2020 నుంచి 13–12–2020 వరకు: వెబ్‌ ఆప్షన్లు 
  • 15–12–2020న: సీట్ల కేటాయింపు 
  • 15–12–2020 నుంచి 19–12–2020 వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

చివరి దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. 

  • 22–12–2020: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌ 
  • 23–12–2020: స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 
  • 22–12–2020 నుంచి 24–12–2020 వరకు: వెబ్‌ ఆప్షన్లు 
  • 26–12–2020: సీట్ల కేటాయింపు.. 
  • 26–12–2020 నుంచి 29–12–2020: సీట్లు పొందిన వారు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్, మొదటి, చివరి దశలో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయడం. 
  • 28–12–2020: వెబ్‌సైట్‌లో (https://tsicet.nic.in) స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement