
గేటు ఎదుట మంత్రి కాళ్లపై పడుతున్న స్థలదాత కుమారుడు
బయ్యారం: ‘సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇస్తే ఉద్యోగం ఇస్తామన్నారు.. నమ్మి అప్పగిస్తే ఇంత వరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆ బెంగతో మా కుటుంబపెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు ఉద్యోగం ఇచ్చాకే మీరు లోపలికి వెళ్లాలి..’అని సబ్‌స్టేషన్‌కు స్థలం ఇచ్చిన కుటుంబం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో 20 గుంటల భూమిని 2018 సంవత్సరంలో సంతులాల్‌పోడు తండాకు చెందిన గుగులోత్ లాల్‌సింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం ఇచ్చాడు.
ఆ సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని స్థానిక పెద్దలు, అప్పటి అధికారులు హామీ ఇచ్చారు. అయితే సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినా ఉద్యోగం ఇవ్వకపోవటంతో మనస్థాపంతో స్థలం ఇచ్చిన లాల్‌సింగ్ 2020లో సబ్‌స్టేషన్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మృతుడి భార్య కౌసల్య, కుమారులు మల్సూర్, వినోద్‌కుమార్ ఉద్యోగం కోసం పలువురు అధికారులను కలసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల స్థలదాత కుటుంబసభ్యులు సబ్‌స్టేషన్ గేటుకు తాళం వేశారు.
ఈ క్రమంలో ఆదివారం మంత్రి సబ్‌స్టేషన్ వద్దకు రావటంతో స్థలదాత కుటుంబసభ్యులు తాళం వేసిన గేటు ఎదుట నిలబడి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంత్రి కాళ్లపైబడి తమకు న్యాయం చేయాలని వేడుకోవడంతో.. ఆమె విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవత్‌తో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పారు. కాగా, సబ్‌స్టేషన్ లోనికి వెళ్లకుండానే మంత్రి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment