నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ వద్ద బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీస్తున్న స్థానికులు, తోటి ప్రయాణికులు
బాల్కొండ/నిర్మల్ చైన్‌గేట్: నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై తెల్లవారు జామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు లారీని ఓవర్‌టేక్ చేయబోతుండగా అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో ముందు కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న మెండోరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ బస్సు డ్రైవర్ సహా 20 మంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో నిర్మల్ జిల్లా కొరిటికల్‌కు చెందిన రాజు అనే ప్రయాణికుడికి రెండు కాళ్లు విరిగాయి.
ఖానాపూర్‌కు చెందిన వినోద్‌కు ఒక కాలు, హిమజ అనే ప్రయాణికురాలికి చెయ్యి విరిగింది. ఈ ముగ్గురిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదస్థలం నుంచి క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కాగా, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా.. లేక ఇతర కారణాలేమయినా ఉన్నాయా అన్న అంశంపై విచారణ చేస్తున్నట్లు ఆయనవెల్లడించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment