మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతున్న సజ్జనార్
నల్లగొండ రూరల్: డీజిల్ ధరలు 30 శాతం పెరగడంతో ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చెప్పారు. ఈ విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శనివారం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి డీలక్స్ బస్సులో నల్లగొండకు చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి ఉమ్మడి జిల్లాలోని డిపోల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో పలు దుకాణాలను పరిశీలించారు.
అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడి బస్సు సౌకర్యం, బస్టాండ్‌లో ఉన్న వసతులపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరగా.. ఆయా గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు కోసం ట్విట్టర్‌లో పోస్టు చేస్తే స్పందిస్తానని, స్థానిక డిపో మేనేజర్లను కలసి బస్సు కోసం సంప్రదించొచ్చని సజ్జనార్ సూచించారు.
రాష్ట్రంలో 49 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయాలని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని పిలుపునిచ్చారు. శుభకార్యాలకు, విహార యాత్రలకు, వన భోజనాలకు, రైతుల ధాన్యం తరలింపునకు ఆర్టీసీ, కార్గో సేవలను అందిస్తామని పేర్కొన్నారు. అందుకు అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు.
ప్రయాణికుల భద్రత కోసం రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్యాట్ కార్డు తరహాలో కొత్త పథకాలు అమలు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ఆర్టీసీ ఆస్తులపై పోస్టర్లు అంటించరాదని, పోస్టర్లు అంటిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్, హైదరాబాద్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని తెలిపారు. నార్కట్‌పల్లిలో ప్రయాణికుల వస్తువులను చోరీ చేసిన ప్రైవేటు ట్రావెల్స్ ఘటన మీడియా ద్వారానే తెలిసిందని చెప్పారు. ప్రైవేటు వాహనాల్లో భద్రత ఉండదని, సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీని ఆదరించాలని కోరారు.
సాధారణ ప్రయాణికుడిలాగే..
హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలాగే సజ్జనార్ నల్లగొండకు చేరుకున్నారు. నల్లగొండ బస్టాండ్, డిపోను పరిశీలించి అధికారులతో మాట్లాడిన అనంతరం బస్సులోనే మిర్యాలగూడకు వెళ్లారు. కలెక్టర్, ఎస్పీలు సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment