Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు | Ugadi celebrations in Rabindra Bharati | Sakshi
Sakshi News home page

Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు

Published Thu, Mar 23 2023 2:11 AM | Last Updated on Thu, Mar 23 2023 3:27 PM

Ugadi celebrations in Rabindra Bharati - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలు విపరీతమైన రాజకీయ ఒడిదుడుకులకు కారణమవుతాయి. అక్టోబర్‌ 31కి రాహువు, కేతు గ్రహాలు మారుతున్నందున.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది’అని శృంగేరీ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి పేర్కొన్నారు. అధికార పక్షంలోని కొందరినుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అధికారంలోని పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు.

ఈ ఏడాది   బుధుడు రాజుగా ఉన్నందున.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిలువరించగలదన్నారు. సప్తమాధిపతి అయిన గురువు అష్ట్టమంలో మౌఢ్య స్థితిలో ఉన్నందున ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం బాగా కష్టపడాల్సి వస్తుందని వెల్లడించారు. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఉదయం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పక్షాన ఈ వేడుకలను నిర్వహించారు.

కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగాన్ని పఠించారు. కొన్నేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నా..సామాజిక అశాంతి నెలకొంటుందని వెల్లడించారు. అశాంతి ఏర్పడ్డా, పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు.
 
మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..  

‘గురుడు జలాశయ కారకుడు అయినందున రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారతాయి. కేంద్ర, రాష్ట్రాలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వర్సిటీల్లోనూ,  ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు ఇవ్వబోతున్నాయి.

వచ్చే మార్చిలో ప్రకృతి ఉపద్రవాలు, మత ఘర్షణలు, సామాజిక అశాంతికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. బుధుడు భాగ్యమందు మంచి స్థితిలో ఉన్నందున రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు కావటంతో ఆర్థిక రంగం కొంత పురోగమిస్తుంది. కీలక పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు సాగుతాయి.

ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. గురు, శుక్ర మౌఢ్యాలు 40 రోజులు మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో శుభకార్యాలు విపరీతంగా జరుగుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరగనున్నా.. పాలల్లో, ఆహారపదార్థాల్లో కల్తీ సమస్య కూడా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఏర్పడతాయి. ఏప్రిల్‌ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు.  

సీఎం దైవ బలాన్ని సంపాదించుకోవాలి.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన కర్కాటక రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నా యని సంతోష్ కుమార్‌ శాస్త్రి పేర్కొన్నారు. ఆదా యం 11 వ్యయం 8 రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందని, రాహువులో రవి దశ ముగిసి చంద్ర దశ నడుస్తోందని, జనవరి 17న అష్టమ శని దోశం ఏర్పడినందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

సీఎం దైవ బలాన్ని సంపాదించుకోగలిగితే అవాంతరాలను అధిగమించే వీలుంటుందన్నారు. కాగా, మంచి వానలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగం సూచించటం పట్ల ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పండితులను సన్మానించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement