సాక్షి, గచ్చిబౌలి: హైటెక్ సిటీలోని వడ్డెర బస్తీకి అంతు చిక్కని అస్వస్థత చుట్టుముట్టింది. పదులు సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒకరు తేరుకోక ముందే మరో ముగ్గురు అన్నట్లుగా కొనసాగుతోంది వడ్డెర బస్తీలోని అస్వస్థత కేసుల సంఖ్య. మొదటి రోజు 20 మంది ఉన్న బాధితులు రెండో రోజు 51కి చేరింది.
మూడో రోజుకు 76కు చేరడం అందరినీ కలవర పెడుతోంది. కలుషిత మంచి నీరు కారణమని చెబుతుండటంతో ఇప్పటికే నీటి శాంపిల్స్ సేకరించిన వాటర్ వర్క్స్ అధికారులు శనివారం మళ్లీ శాంపిల్స్ సేకరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారయణ వడ్డెర బస్తీని సందర్శించి తాగునీటిని పరిశీలించారు.
గాంధీకి అయిదుగురి తరలింపు
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అయిదుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురై విరేచనాలు, వాంతులతో బాధపడుతున్న వారిలో కిడ్నీ సమస్యలు ఉండటంతో శుక్రవారం ముగ్గురికి, శనివారం ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించామని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదా చారి తెలిపారు.
నీటి నమూనాల సేకరణ
వడ్డెర బస్తీలో జనం అస్వస్థకు గురైన వెంటనే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు 40 ఇళ్లలో శాంపిల్స్ సేకరించారు. థర్డ్ పార్టీ పరీక్షలు నిర్వహించిందని ఎలాంటి కలుషితం లేదని చెప్పినట్లు వాటర్‌వర్క్స్ జీఎం రాజశేఖర్ తెలిపారు. మరో రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు.
కలుషితమే కారణమంటున్నారు
మంచి నీరు, ఆహరం, గాలి కలుషితం కారణంగానే విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచి నీటిలో మురుగు నీరు సరఫరా జరిగిందని, కలుషిత నీటి కారణంగానే అస్వస్థత చోటు చేసుకుందని వడ్డెర బస్తీ వాసులు పేర్కొంటున్నారు.
(చదవండి: భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు)
Comments
Please login to add a commentAdd a comment