
సాక్షి, విద్యారణ్యపురి : అచ్చంగా తెలంగాణ రాష్ట్రం కోసమే అక్షర సేద్యం చేసిన ప్రముఖ కవి, హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ అధ్యాపకులు వెలపాటి రాంరెడ్డి(89) కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం హన్మకొండ కనకదుర్గకాలనీలోని తన స్వగృహంలో మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేగుల గ్రామంలో 1932 నవంబర్ 4న కేశవరెడ్డి, చిలకమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఇంగ్లిష్ అధ్యాపకుడిగా కొనసాగుతూనే ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. పుస్తకాలు రాయడమే కాకుండా తెలుగు కవుల సమ్మేళనాల్లో భాగస్వాములయ్యేవారు. కాగా, రాంరెడ్డి రాసిన తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది.
తెలంగాణ కావ్యం, వీరతెలంగాణ, వెలుగు నీడలు, తెలంగాణ పద్యమంజరి, కోటిగాయాల మౌనం తెలంగాణ, తెలంగాణ నడుస్తున్న చరిత్ర, నవశకం వంటి అనేక పుస్తకాలను తెలంగాణ నేపథ్యంలోనే ఆయన రచించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. కాగా, ఏడో తరగతి తెలుగు వాచకంలో మన శిల్పారామం రామప్ప, ఇంటర్ తెలుగు వాచకంలో ఓ కావ్యంగా ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ప్రచురించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న రాంరెడ్డి మృతిపై హన్మకొండలోని సాహిత్య సాంస్కృతిక సంస్థ బాధ్యులు గిరిజ మనోహరబాబు, డాక్టర్ ఎన్‌వీఎన్.చారి, వనం లక్ష్మీకాంతారావు, కృష్ణమూర్తి తదితరులు సంతాపం ప్రకటించారు.
చదవండి: జర్నలిస్టులకు వ్యాక్సినేషన్: సీఎంకు ప్రెస్‌క్లబ్ కృతజ్ఞతలు