ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యాలాల: ఇద్దరు కొడుకులతో కలసి సరదాగా చెక్‌డ్యాం ప్రదేశాన్ని చూసొద్దామని వెళ్లిన ఓ తల్లికి తీరని విషాదం మిగిలింది. కళ్లెదుటే కొడుకు నీటమునుగుతుంటే తల్లిమనసు తల్లడిల్లింది. నిస్సహాయస్థితిలో ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌కి చెందిన హారూన్ హుస్సేన్, సైదా బేగం దంపతులకు షేక్ రిహాన్(11), సోఫియాన్ సంతానం. హారూన్ హుస్సేన్ సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాతతాండూరులో నివాసముంటున్న తన సోదరి ఇంట్లో శుక్రవారం జరిగిన విందుకు సైదాబేగం తన ఇద్దరు కొడుకులతో కలసి వెళ్లింది.
సోమవారం మధ్యాహ్నం పాత తాండూరు శివారులో ఉన్న చెక్‌డ్యాం వద్ద సరదాగా కాసేపు గడిపి వద్దామని ఇద్దరు కొడుకులు, సోదరితో కలసి వెళ్లింది. చెక్‌డ్యాం సమీపంలో అక్కాచెల్లెళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా రిహాన్ నీళ్లలోకి దిగాడు. మోకాలి లోతు వరకు దిగిన రిహాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. సైదా బేగం గమనించి సహాయం కోసం కేకలు పెట్టింది. అక్కాచెల్లెళ్లకు ఈత రాకపోవడం, సహాయం చేసేందుకు సమీపంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బాలుడిని రక్షించలేకపోయారు. కొద్ది సేపటి అనంతరం బాలుడి మృతదేహాన్ని స్థానికులు నీటి నుంచి బయటికి తీశారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లి రోదనలు మిన్నంటాయి.
ఇసుక కోసం తోడిన గుంతలతోనే ప్రమాదం!
చెక్‌డ్యాం ప్రదేశంలో ఇసుక కోసం అక్రమార్కులు ఇష్టారాజ్యం గా తోడిన గుంతలే బాలుడిని మింగేశాయి. ప్రతి వేసవిలో చెక్‌డ్యాం నుంచి పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఇసుక కోసం తవ్వడంతో ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచాయి. అవగాహన లేనివారు నీళ్లలో అడుగుపెట్టి ప్రమాదవశాత్తు అందులోకి జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిన్నారి రిహాన్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment