
మోర్తాడ్(బాల్కొండ): వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. విజిట్ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కువగా ఉండడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టింది. సాధారణంగా యూఏఈ 30, 60 రోజుల విజిట్ వీసాలను జారీ చేస్తుంటుంది.
ఈ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిపోకముందే వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇకపై తమ దేశంలో ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా నిషేధిత జాబితాలో చేరుస్తామని అక్కడి సర్కారు ప్రకటించింది. దీనివల్ల వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రవేశానికి అనర్హులు అవుతారు.
విజిట్ వీసాలపై వచ్చి యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు ఎవరైనా చట్టబద్ధంగానే తమ దేశంలో ఉండే విధంగా యూఏఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. యూఏఈలో ఉపాధి చూపిస్తామని.. తొలుత విజిట్ వీసాపై వెళ్లాక, తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్ల మాటలను నిరుద్యోగులు నమ్మవద్దని గల్ఫ్ వలస కారి్మక సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు.