సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టింది ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న బిషప్ హ్యారీ సెబాస్టియన్ అని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ కుట్రలో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై గురువారం ఏసీబీ అదనపు ఎస్పీ రమణకుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయి. సెబాస్టియన్ ఫోన్‌లో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ఓటు కోసం ప్రలోభపెట్టడం అవినీతి నిరోధక చట్టం కింద నేరం. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్న సెబాస్టియన్ వాదనలో నిజం లేదు. స్టీఫెన్‌సన్‌తో ముందుగా ఫోన్‌లో మాట్లాడిందని సెబాస్టియన్. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డితో కలసి సెబాస్టియన్ స్టీఫెన్‌సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసిన తర్వాత సెబాస్టియన్ సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా అనేక ఆధారాలు లభించాయి’’ అని తెలిపారు. ( ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ)
అంతేకాక ‘‘అభియోగాల నమోదుపై 2018 మార్చి 5 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిందితులు సమయం తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 9న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అభియోగాలు నమోదు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు గత అక్టోబరు 12న డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని లేదా నేరుగా వాదనలు వినిపించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే సెబాస్టియన్ తరఫు న్యాయవాది పలు వాయిదాలు తీసుకున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని కౌంటర్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment