పండుగకు రైలు బండి గగనమే!! | The Waiting List On All Trains Increased In This Festival Season | Sakshi
Sakshi News home page

పండుగకు రైలు బండి గగనమే!!

Published Mon, Jan 3 2022 7:53 AM | Last Updated on Mon, Jan 3 2022 8:48 AM

The Waiting List On All Trains Increased In This Festival Season - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఈసారి  సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు  ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్న నగర వాసులను వివిధ మార్గాల్లో నడిచే రైళ్లు నిరాశకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో  వెయిటింగ్‌ లిస్టు 250 నుంచి 300 వరకు చేరింది. కొన్ని రైళ్లలో  ‘నో రూమ్‌’ దర్శనమిస్తోంది. బెర్తులన్నీ పూర్తిగా భర్తీ కావడంతో ఫిబ్రవరి వరకు బుకింగ్‌ సేవలను సైతం నిలిపివేశారు. సాధారణంగా మూడు నెలల ముందే రిజర్వేషన్‌ బుకింగ్‌ సదుపాయం ఉండడంతో డిసెంబర్‌లోనే అన్ని రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు  పెరిగింది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఇప్పటికిప్పుడు ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప నగరవాసులు  సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కానీ ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే పెద్దగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో మాత్రం అరకొరగా అదనపు రైళ్లను ప్రకటించారు.  

పెరగనున్న రద్దీ.. 

  • కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా జనం సొంత ఊళ్లకు వెళ్లకుండా నగరంలోనే  సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. మరోవైపు రైళ్లు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన మార్గాల్లో  అదనపు చార్జీలతో ప్రత్యేక రైళ్లు నడిపారు. దీంతో  సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న వాళ్లు  ప్రైవేట్‌ బస్సులు, ఇతర వాహనాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని రూట్లలో రెగ్యులర్‌ రైళ్లను పునరుద్ధరించారు. అదనపు చార్జీలను రద్దు చేశారు.  
  • ప్రస్తుతం నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 120  ఎక్స్‌ప్రెస్‌  రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖ, కాకినాడ, విజయవాడ,తిరుపతి, బెంగళూరు, ముంబయి, షిరిడీ, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో ఇప్పటికే  బెర్తులు భర్తీ అయ్యాయి. రానున్న రోజుల్లో మరింత రద్దీ పెరగనుంది. ప్రత్యేకంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్లకు మరింత డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉంది.  

ప్రత్యేక రైళ్లు పది.. 

  • ఒకవైపు రద్దీ భారీగా ఉండగా, దక్షిణమధ్య రైల్వే మాత్రం తాజాగా సంక్రాంతి సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాచిగూడ–విశాఖపట్టణం (07497/ 07498) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 16 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
  • కాచిగూడ–నర్సాపూర్‌ (82716/07494) సువిధ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 11న రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి  రోజు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి  రోజు ఉదయం 4.50 గంటలకు  కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ–లింగంపల్లి  ( 07491/07492) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 19, 21 తేదీల్లో రాత్రి 8.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 22 తేదీల్లో సాయంత్రం 6.40కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.  

నిరీక్షణే మిగిలింది.. 
హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే గౌతమి. విశాఖ, నర్సాపూర్, ఫలక్‌నుమా, నారాయాణాద్రి, పద్మావతి, వెంకటాద్రి, తదితర అన్ని రైళ్లలో 250 నుంచి 300 కు పైగా వెయిటింగ్‌ లిస్టు పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు  ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా  ఈ నెల  10వ తేదీ నుంచి  20 వరకు  ప్రయాణం చేసేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. స్లీపర్, ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement