What Is Dry Run Of Vaccine, How It Is Done | Difference Between Dry Run And Vaccination - Sakshi
Sakshi News home page

డ్రైరన్, వాక్సినేషన్‌కు తేడా ఏమిటి..?

Published Sat, Jan 2 2021 8:23 AM | Last Updated on Sat, Jan 2 2021 2:50 PM

What Is Dry Run How It Is Done Difference Between Vaccination - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో గత కొన్నిరోజులుగా డ్రైరన్‌ అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మన రాష్ట్రంలో శనివారం ఇది జరగనుంది. హైదరాబాద్‌లో తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ), నాంపల్లి ఏరియా ఆసుపత్రి, సోమాజిగూడ యశోద ఆసుపత్రితోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నేహా షైన్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. ఇంతకీ డ్రైరన్‌ అంటే ఏమిటి? వ్యాక్సినేషన్‌కు దీనికి తేడా ఏమిటి? ఓసారి చూద్దాం.. 

మాక్‌డ్రిల్‌ మాదిరిగా... 
ఏదైనా ప్రమాదం లేదా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఎలా స్పందించాలో తెలియజెప్పేందుకు మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తుంటారు తెలుసు కదా? కరోనా డ్రైరన్‌ కూడా అలాంటిదే. టీకా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? ఆ ప్రణాళిక అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు, వ్యాక్సిన్‌ రవాణా, నిల్వ ఇతరత్రా అన్ని అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే డ్రైరన్‌ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఎదురైన సవాళ్లను గుర్తించి పరిష్కరిస్తారు. అలాగే ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే ఏం చేయాలో ప్రాక్టీస్‌ చేస్తారు. తద్వారా అసలైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగడానికి మార్గం సుగమం చేస్తారు. 

డ్రైరన్‌ ఇలా జరుగుతుంది.. 

  • ప్రతి డ్రైరన్‌ కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తిస్తారు. వారి డేటాను కోవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 
  • స్థలం, ఇతర ఏర్పాట్లు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, విద్యుత్, భద్రత తదితర అంశాలను పరిశీలిస్తారు.  
  • మూడు గదులున్న కేంద్రంలో టీకాలు వేస్తారు. వాటికి ప్రత్యేక ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను నిర్దారించుకుంటారు. 
  • డ్రైరన్‌ టీకా సరఫరా, నిల్వ, కోల్డ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ సహా అన్నింటినీ పరిశీలిస్తారు.  
  • 25 మంది ఆరోగ్య కార్యకర్తలు డ్రైరన్‌ కేంద్రానికి వస్తారు.  
  • మొదటి వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌ తన వద్ద జాబితాలో వ్యాక్సిన్‌ తీసుకునే వ్యక్తి పేరు ఉందో లేదో నిర్దారించి కేంద్రంలోకి అనుమతిస్తారు.  
  • ఆ తర్వాత రెండో వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌ కోవిన్‌ యాప్‌లో సదరు వ్యక్తి పేరును సరిచూస్తారు.  
  • వ్యాక్సిన్‌ లేకుండానే అతడికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లుగా సిబ్బంది ట్రయల్‌ వేస్తారు.  
  • అనంతరం వ్యాక్సినేషన్‌ చేసిన విషయాన్ని రెండో వ్యాక్సినేటర్‌కు తెలియజేస్తారు. ఆ విషయాన్ని ఆయన కోవిన్‌ యాప్‌లో రిపోర్ట్‌ చేస్తారు.  
  • మూడు, నాలుగో వ్యాక్సినేటర్‌ ఆఫీసర్లు వ్యాక్సిన్‌ కోసం వచ్చేవారిని క్యూలో ఉండేలా చూస్తారు.
  • వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులు 30 నిముషాలు వేచి ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. 
  • ఒకవేళ వారికి ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే రెండో వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌ కోవిన్‌ యాప్‌ సైట్‌ ద్వారా రిపోర్ట్‌ చేస్తారు. 
  • ఫిర్యాదులుంటే 104 లేదా 1075కు ఫోన్‌ చేస్తారు. 

 – సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement