సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో సరైన పత్రాలు లేకుండా, లెక్కలు చూపకుండా తరలిస్తున్న నగదును ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రూ. 2 కోట్ల 47 లక్షల రూపాయల మొత్తం పట్టుబడింది. పట్టుబడ్డ నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగారం జేపీ సినిమాస్ వద్ద స్థానికుడు సి.మురళీ నుంచి రూ.2.76 లక్షలు స్వాదీనం చేసుకున్నారు.
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళ్లూరి థియేటర్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వాహనదారుడి వద్ద నుంచి రూ.7.12 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నగదు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ముస్తఫా అలీఖాన్ అనే వ్యక్తి నుంచి రూ.5 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న షేక్ అన్సార్ ఆలీ, షేక్ అహ్మద్ ఆలీ నుంచి రూ.9.5 లక్షల రూపాయల నగదు పట్టుబడింది.
ఘట్‌కేసర్ శివారెడ్డిగూడలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న గోపాల్‌రెడ్డి నుంచి రూ. 3లక్షలు స్వాదీనం చేసుకున్నారు. అన్నోజిగూడలోని హైవేపై తనిఖీలు చేస్తున్న క్రమంలో బైక్‌పై వెళ్తున్న వెంకటాపూర్‌కు చెందిన నీరుడి లింగం నుంచి రూ.5లక్షలు స్వాదీనం చేసుకున్నారు. మేడిపల్లి ప్రాంతానికి చెందిన వేణు నంబరు ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఉప్పల్ పోలీసులు తనిఖీ చేసి రూ. 6,22,500ను స్వాధీనం చేసుకున్నారు.
మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్‌కు చెందిన సిట్టికుంట కృష్ణాకర్‌రెడ్డి నుంచి రూ. 8 లక్షల 63 వేల 200 నగదును స్వాదీనం చేసుకున్నారు. చెన్నాపురం చౌరస్తా వద్ద జవహర్‌నగర్ పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ కారులో రూ.6 లక్షలు తరలిస్తుండగా వాటిని సీజ్ చేశారు. కోదాడ పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా హుజూర్‌నగర్ మండలం మదావరాయినిగూడెంకు చెందిన వస్త్ర వ్యాపారి వినయ్ వద్ద రూ.10 లక్షల నగదు పట్టుబడింది.
ఎల్‌బీనగర్‌లో రూ. 28,99,640 పట్టివేత
ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో.. వనస్ధలిపురంకు చెందిన దినేష్ సింగ్ ఠాకూర్ వద్ద రూ.3,62,000 లక్షలు, రామంతాపూర్ కు చెందిన కాటం లెనిన్ బాబు వద్ద రూ.1.80 వేలు, ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ముఖేష్‌పాండే వద్ద రూ.13,58,640, వనస్ధలిపురంకు చెందిన వెదిర్ అశోక్ వద్ద రూ.3లక్షలు, కొత్తపేట నివాసి దంతూరి అరుణ్ రాజ్ వద్ద రూ.4,69,500, విజయవాడకి చెందిన కామోదుల అజయ్‌కుమార్ వద్ద రూ.2,29,500 లక్షలు దొరికినట్లు ఎల్‌బీనగర్ పోలీసులు తెలిపారు.
నల్లగొండలో కోటిన్నర స్వాధీనం
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పాయింట్‌లో బి.ఎన్.రెడ్డికి చెందిన కన్నెకంటి వెంకటనారాయణ, మూరుకొండ శ్రీనివాసరావు నుంచి రూ.కోటి యాభై లక్షలు స్వాదీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతోనే సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment