సాక్షి, మంచిర్యాల: ఓ మద్యం షాపు పుణ్యమా అని ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డు పూర్తిగా మందు బాబులకే అంకితమైంది. ప్రజాధనంతో రూ.లక్షలు ఖర్చు చేసి మున్సిపాలిటీ పాలకవర్గం రోడ్డు వేయిస్తే ఆ రోడ్డు స్థానికులకు ఉపయోగం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీచౌరస్తాకు వెళ్లే మార్గమధ్యలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఓ వైన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ వైన్స్‌కు వచ్చే కస్టమర్ల సిట్టింగ్ కోసం ప్రత్యేకంగా పర్మిట్ రూం ఉంది. అయితే రాత్రివేళలో వైన్స్‌కు వచ్చే వారు అనుమతి పొందిన పర్మిట్ రూంకే పరిమితం కాకుండా మందుబాబులు రోడ్డుపైకి కూడా వస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో రోడ్డుకు అడ్డుగా కాలనీవాసులు వేయగా ప్రస్తుతం వైన్స్ నిర్వాహకులు తీసి వేయడం లేదు. రోజు సాయంత్రం మద్యం షాపునకు వచ్చే కస్టమర్ల తాకిడితో ఆ కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది.
దీంతో ఆ కాలనీకి వెళ్లే రోడ్డును పూర్తిగా ఇనుప రేకులను అడ్డుగా ఉంచి రాకపోకలు లేకుండా దారిని బ్లాక్ చేశారు. వైన్స్ ఏర్పాటు చేయకముందు సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు ఈ రోడ్డు గుండా మెయిన్ రోడ్డుకు రాకపోకలు సాగించేవారు. అయితే తరచూ రోడ్డుపైకి మందుబాబులు వస్తుండడంతో ఏకంగా రోడ్డునే మందుబాబులకు కేటాయించినట్లు అయింది. రోడ్డు బ్లాక్‌పై అటు మున్సిపల్ అధికారులు, ఇటు ట్రాఫిక్, ఎక్సైజ్‌శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ దారిని వైన్స్ యాజమానులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఇక రాత్రిపూట అయితే ఈరోడ్డుపైనే మద్యం సేవిస్తున్నారు. దీంతో ఆ కాలనీవాసులు ఈ రోడ్డు వైపు నుంచి రాకుండా వేరే మార్గం గుండా వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment