సాక్షి, హైదరాబాద్: సెయిలింగ్ వంటి విభిన్నమైన రేసుల్లో మహిళలు రాణించడం హర్షణీయమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. నగరంలో జరిగిన ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’లో 93 మంది సెయిలర్స్ పాల్గొంటే అందులో 17 మంది రేసర్లు బాలికలు ఉండటం అభినందనీయమన్నారు.
ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహించిన 37వ ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’పోటీల విజేతలకు ఆమె ఆదివారం మెడల్స్, ట్రోఫీలను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ మాట్లాడుతూ., సెయిలింగ్ అనేది అనేక ఛాలెంజ్‌లతో కొనసాగే క్రీడ అని, ఇందులో రాణించడం అంత సులభం కాదని పేర్కొన్నారు.
ఈ గేమ్‌లో రాణించిన రేసర్లు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే పరిపూర్ణతను సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఏషియన్స్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో కూడా మన వాళ్లు పతకాలను సాధించాలని ఆశించారు. సెయిలింగ్ వంటి విభిన్న ఆటలకు నగర వాతావరణం అనుకూలంగా ఉండటం హర్షణీయమన్నారు.
సాగర్ పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి
ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్‌ను మరింత పరిశుభ్రంగా చూసుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంతో పాటు నగరవాసులు కూడా హుస్సేన్ సాగర్ సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని, అందరూ కలిసి పనిచేస్తేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. గతంలో సాగర్ వేదికగా సెయిలింగ్ పోటీలు నిర్వహించే సమయంలో చేపలు, కప్పలు, పాములు కనిపించేవని, కానీ ఇప్పుడు కాలుష్యం వల్ల అవి కనిపించడం లేదని ఆర్మీ అధికారులు చెప్పారని గవర్నర్ పేర్కొన్నారు.
పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖ అందించిన సహకారానికి ఎమ్‌సీఈఎమ్‌ఈ కమాండెంట్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లేజర్‌స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 విభాగాల్లో మొత్తం 12 రేసుల్లో విజేతలకు గవర్నర్ మెడల్స్, ట్రోఫీలను అందించారు.
ఐఎల్‌సీఏ 4 విభాగంలో వైష్ణవి, మల్లేష్, ఐఎల్‌సీఏ 6లో రితికా డాంగి, కోటేశ్వరరావు, ఐఎల్‌సీఏ 7లో హవ్ మోహిత్ సైనీ స్వర్ణ పతక విజేతలుగా నిలిచారు. ఛాంపియన్ ట్రోఫీలను మల్లేష్, వైష్ణవి, నేషనల్ ఛాంపియన్ ట్రోపీని రితికా డాంగి సాధించారు. వీటితో పాటు పలు విభాగాల్లో పతకాలను గవర్నర్ చేతుల మీదుగా రేసర్లు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment