సాక్షి, వెబ్‌డెస్క్: సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్‌కి ఏకైక పతకాన్ని అందించిన ఘనత కరణం మల్లేశ్వరీ సొంతం. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు మీరాచాను ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు వాళ్లకీ వారసురాలు మన భాగ్యనగరంలో రెడీ అవుతోంది. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే భారీ బరువులు సునాయాసంగా లేపుతోంది. పాలబుగ్గల వయసులోనే వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.
వరల్డ్ రికార్డ్
హైదరాబాద్ నగరానికి చెందిన సందీప్, సాయి స్నిగ్ధబసు దంపతుల ముద్దు బిడ్డ సాయి అలంకృత కేవలం 20 నెలల వయసులోనే సంచలనాలు సృష్టిస్తోంది. తోటి పిల్లలెవరికీ సాధ్యం కాని రీతిలో బరువులను ఎత్తుతోంది. పాపలోని టాలెంట్‌ని గమనించిన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకుంది.
ఏడాది వయస్సులోనే
ఏడాది వయస్స ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్స్ వాటర్ బాటిల్‌ని సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది. అప్పటి నుంచి పాపలోని స్పెషల్ ట్యాలెంట్‌ని తల్లిదండ్రులు గమనిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో 4.2 కేజీల బరువు ఉన్న వాటర్ మిలాన్‌ని పదిహేడు నెలల వయస్సులో ఎత్తింది, ఇప్పుడు 20 నెలల వయస్సులో 5 కేజీల బరువును ఎత్తడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది.
6 కేజీలు ఎత్తగలదు - సందీప్ (తండ్రి)
బరువులు ఎత్తడంలో పాపకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి, ఆమెకు స్పెషల్ డైట్ అందిస్తున్నాం. పాపకు ఇప్పుడు 20 నెలలు, ఈ వయసు పిల్లలు కేజీ వరకు బరువులే అతి కష్టంగా ఎత్తగలరు. ఇప్పటి వరకు 4 ఏళ్ల బాబు 3 కేజీలు ఎత్తడమే వరల్డ్ రికార్డ్. అలంకృత ఇప్పుడు 6 కేజీల వరకు బరువును ఎత్తగలుగుతోంది. మేము 5 కేజీల బరువు ఎత్తిన వీడియోనే రికార్డు పరిశీలనకు పంపించాం.
సంతోషంగా ఉంది - సాయి స్నిగ్ధబసు (తల్లి)
ఏడాది వయసులో పాపలోని స్పెషల్ టాలెంట్‌ని గుర్తించి గమనిస్తూ వచ్చాం. ఈ రోజు మా పాప టాలెంట్‌ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించడంతో సంతోషంగా ఉంది. స్పెషల్ టాలెంట్ ఉన్న పిల్లలను ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment