రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారంలో కాలాముఖ దేవాలయం ఉన్నట్లు పురావస్తు శాస్త్ర పరిశీలకుడు రామోజు హరగోపాల్ తెలిపారు. గురువారం కుర్రారంలోని త్రికూట బసవేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గ్రామంలో కాకతీయుల కాలంనాటి దేవాలయం ఉందని, కోటగుళ్లలోని శిల్ప విన్యాసం కుర్రారం శివాలయంలో కూడా కనిపిస్తుందని చెప్పారు. కుర్రారం శివాలయం త్రికూటరూపం. శిథిలం కావడంచేత కొంత భాగం శిథిలమైపోయిందని చెప్పారు.
దేవాలయానికి ముఖమంటపం, అంతరాళం, గర్భగుడులు ఉన్నాయని తెలిపారు. మంటపంలోని స్తంభాలు కాకతీయశైలి, అంతరాళం ద్వారం శోభాయమానమైన శిల్పాలచేత అలంకృతమై ఉందన్నారు. ద్వారానికి రెండు వైపులా శైవ ద్వారపాలకులు ఇద్దరిద్దరు పరివారంతో వున్నారని చెప్పారు. గడపకు ముందు శైవమూర్తుల శిల్పాలు ఉన్నాయన్నారు. ఇవి కుర్రారం దేవాలయం కాలాముఖుల ఆరాధనాక్షేత్రమని చెబుతున్నాయని వివరించారు. దేవాలయం ముందర రామప్ప, వేయిస్తంభాల గుడుల పద్ధతిలో నందికి ప్రత్యేక మంటపం వుంది. గుడిలోపల కనిపించే విడివిగ్రహాలలో చాళక్యశైలి పార్వతి శిల్పముందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment