సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్ చానల్‌లో చూసిన క్రైమ్ న్యూస్ స్ఫూర్తితో ఫేస్‌బుక్‌లో యువతి మాదిరిగా ప్రొఫైల్ క్రియేట్ చేసి, నగరానికి చెందిన వ్యక్తితో ఆన్‌లైన్ ప్రేమాయణం సాగించి, వివిధ అవసరాల పేర్లు చెప్పి రూ.45 లక్షలు స్వాహా చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కొత్వాల్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
మోథె అశోక్
►ఏపీలోని నూజివీడుకు చెందిన మోథె అశోక్ బీటెక్ ఆఖరి సంవత్సరంలో ఆపేశాడు. ఆవారాగా తిరిగే ఇతడికి ప్రస్తుతం భార్య, కుమార్తె ఉన్నారు. యూట్యూబ్ చానల్స్ చూసే అలవాటున్న ఇతడిని ఓ దాంట్లో వచ్చిన క్రైమ్ న్యూస్ ఆకర్షించింది. ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతి ప్రేమలో పడి మోసపోయాడన్నది దాని సారాంశం.
►ఇది చూసిన అశోక్ తానే యువతిగా ‘మారి’ మోసాలు చేయాలని పథకం వేశాడు. 2020 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌లో ఇందుష తుమ్మల పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువతి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఈ ఖాతా నుంచి అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. ఇలా అందుకున్న జూబ్లీహిల్స్ వాసి ప్రవీణ్ కుమార్ యాక్సెప్ట్ చేయడంతో అసలు కథ మొదలైంది.
►కొన్ని రోజులు ఇందుష మాదిరిగా ప్రవీణ్‌తో చాట్ చేసిన అశోక్ ఆపై ప్రేమ పేరుతో ఎర వేశాడు. వాయిస్ చేంజ్ యాప్‌ను వినియోగించి ప్రవీణ్‌కు కాల్స్ చేసిన అశోక్ ఆకర్షణీయంగా మాట్లాడాడు. ఈ యాప్ కారణంగా అశోక్ గొంతు యువతిదిగా మారి ప్రవీణ్‌కు వినిపించేది. కొన్నాళ్లకు అశోక్ అలియాస్ ఇందుష పెళ్లి ప్రస్తావన చేయడంతో ప్రవీణ్ అంగీకరించాడు.
కాలేజీ ఫీజు, కరోనా పేరుతో..
►అశోక్ 2020 నుంచి ఈ పరిచయాన్ని ‘కమర్షియల్’గా వాడుకోవడం మొదలెట్టాడు. తొలుత కాలేజీ ఫీజు కట్టాలంటూ రూ.3 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. కరోనా మొదటి వేవ్‌లో తల్లికి కోవిడ్ సోకిందని రూ.10 లక్షలు, రెండో వేవ్‌లో తనకూ వచ్చిందంటూ రూ.15 లక్షలు వైద్య ఖర్చుల పేరుతో కాజేశాడు. ఇలా రెండేళ్లలో రకరకాల అవసరాలు చెప్పి రూ.45 లక్షలు ప్రవీణ్ నుంచి గుంజాడు.
►ఓ సందర్భంలో ప్రవీణ్ తన ఆన్‌లైన్ ప్రేమ విషయాన్ని సమీప బంధువుకు చెప్పాడు. ఇది అనుమానించాల్సిన అంశంగా భావించిన ఆయన ఆ విషయం బాధితుడికి చెప్పి, నిజం తెలియాలంటే సదరు ఇందుషను కలుస్తానని అడగమన్నాడు. దీంతో ప్రవీణ్ ఎన్నిసార్లు కోరినా ఇందుషగా చెప్పుకుంటున్న అశోక్ దాటవేస్తూ, డబ్బు అడుగుతూ వచ్చాడు.
►ఇలా తాను మోసపోయానని గుర్తించిన ప్రవీణ్ ఫిర్యాదుతో సైబర్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఎస్సై కె.మధుసూదన్‌తో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. అశోక్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసింది. రూ.45 లక్షల్లో రూ.43 లక్షలు ఆన్‌లైన్ గేమింగ్‌లో ఖర్చు చేశాడని పోలీసులు గుర్తించారు. మిగిలిన రూ.2 లక్షలతో పాటు నేరానికి వాడిన ఫోన్ రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment