
తాళ్లు, కర్రలతో ఏర్పాటుచేసిన వంతెన, రైతు నాగేశ్
భైంసా రూరల్: ఎవరో వస్తారని ఎదురు చూడలేదు. ఎవరూ స్పందించకపోయినా పట్టించుకోలేదు. తాను అనుకున్నది చేశాడు. నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు. సొంత డబ్బుతో వాగుపై వంతెన నిర్మించాడు నిర్మల్ జిల్లా భైంసా మండలం ఖథ్‌గాం గ్రామానికి చెందిన యువ రైతు నాగేశ్. గ్రామ రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి సుద్దవాగు అడ్డుగా ఉంది.
గతంలో వాగు దాటుతూ ఇద్దరు మృతి చెందారు. వాగుపై వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో.. రైతులు, కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రైతు నాగేశ్ సొంత ఖర్చుతో తాళ్లు, కర్రలతో వంతెన నిర్మించాడు. వాగు అవతలివైపు 400 ఎకరాల పంట పొలాలున్నాయి. రైతు నాగేశ్ పొలం కూడా ఉంది. సొంతంగా రూ.25 వేలు ఖర్చుచేసి తాళ్లు, వెదురు కర్రలతో వంతెన నిర్మించిన నాగేశ్‌ను రైతులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.