సూర్యచంద్రులపై పరిశోధనలు... | - | Sakshi
Sakshi News home page

సూర్యచంద్రులపై పరిశోధనలు...

Published Mon, Jun 5 2023 12:36 AM | Last Updated on Mon, Jun 5 2023 10:58 AM

- - Sakshi

అంతర్జాతీయంగా భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సత్తా చాటుతోంది.. గ్రహాంతర ప్రయోగాల్లో దేశప్రతిష్టను ఇనుమడింపజేస్తోంది.. ఇప్పటికే చంద్రయాన్‌.. మంగళయాన్‌ పేరుతో చంద్రుడు.. అంగారకుడిపై పరిశోధనలు చేపట్టింది. అదే స్ఫూర్తితో మరో పర్యాయం చంద్రమండలం స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. అలాగే సూర్యునిపై వాతావరణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది.. ఎల్‌వీఎం–3.. పీఎస్‌ఎల్వీ సీ56 రాకెట్ల ద్వారా విశిష్ట ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు సన్నద్ధమవుతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తిపతాకను అప్రతిహతంగా ఎగురవేసేందుకు అడుగులు వేస్తోంది.

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ మరోసారి ప్రత్యేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. సూర్యచంద్రులపై పరిశోధనలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టులోనే రెండు గ్రహాంతర ప్రయోగాలు విజయవంతం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. జులై 12న ఎల్‌వీఎం–3 రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌–3 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శ్రీహరికోట షార్‌లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో ఎల్‌వీఎం–3 రాకెట్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మే 28వ తేదీన చంద్రయాన్‌–3 మిషన్‌ కూడా బెంగళూరు నుంచి చేరుకుంది. షార్‌లోని క్లీన్‌రూంలో దీనికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గతంలో చంద్రయాన్‌–2 మిషన్‌లో భాగంగా ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను పంపించారు. ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత రోవర్‌ను విడుదల చేసే విధంగా డిజైన్‌ చేశారు. చంద్రయాన్‌–3 ప్రయోగంలో ప్రపొల్సన్‌ మాడ్యూల్‌ ద్వారా ల్యాండర్‌ను చంద్రుడి వైపునకు పంపించబోతున్నారు. ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేసేలా రూపకల్పన చేశారు. చంద్రుడి దక్షిణధ్రువంలో మెత్తగా వుండే స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ దించాలని నిర్ణయించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రయాన్‌–3 ప్రాజెక్టుకి సుమారు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు.

పీఎస్‌ఎల్వీ ద్వారా ఆదిత్య ఎల్‌–1
సూర్యడిపై పరిశోధనలను చేసేందుకు 1,412 కిలోల ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ56 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదికకు సంబంఽధించి పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనంలో రాకెట్‌ అనుసంధానం పనులు చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని జులై ఆఖరుకి కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిత్య ఎల్‌–1 దా్వారా సౌరగోళంలో గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలు చేయనున్నారు.. సౌర తుఫాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు ఏర్పడే అవరోధాలు, కాంతి మండలం (ఫొటోస్పియర్‌), వర్ణ మండలం (క్రోమోస్పియర్‌)పై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

సౌర వాతావరణాన్ని పరిశోధించేందుకు కరోనాగ్రఫీ ప్రయోగమని కూడా అంటారు. భూమికి 1.5 మిలియన్‌ కిలోమీటర్లు దూరంలో వున్న సూర్య వ్యవస్థ లాంగ్రేజ్‌ పాయింట్‌–1 (ఎల్‌–1) కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి పరిశోధనలు చేపట్టనున్నారు. విద్యుదయస్కాంత, కణ, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్లను ఉపయోగించి ఫొటోస్పియర్‌, క్రోమో స్పియర్‌ సూర్యుని బయట పొరలను పరిశీలించేందుకు ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్‌ను అమరుస్తున్నారు.సూర్యుడిపై పరిశోధనల్లో ఇది చారిత్రక ప్రయోగమవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.378 కోట్లు వెచ్చిస్తున్నారు.

సత్తా చాటిన ఇస్రో
గ్రహాంతర ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే సత్తా చాటింది. గతంలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 2008లో చంద్రయాన్‌–1, 2019లో చంద్రయాన్‌–2, 2013లో మంగళ్‌యాన్‌–1 పేరుతో విశేష పరిశోధనలు చేపట్టింది. మూడు గ్రహాంతర ప్రయోగాలు చేసిన ఇస్రో ఇప్పుడు ఏకంగా సూర్యు డిపైకి ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని, చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి చంద్రయాన్‌–3 అనే రెండు ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్‌–1 ప్రయోగంతో లూనార్‌ ఆర్బిట్‌లో చంద్రుడి చుట్టూ ఉపగ్రహాన్ని తిప్పి చంద్రుడికి రెండోవైపు ఏముందో పరిశోధనలు చేసింది.

అప్పుడే చంద్రుడిపై నీరు ఉన్నట్లు కనిపెట్టింది. చంద్రయాన్‌–2 పేరుతో మరో అడుగు ముందుకేసి చంద్రుడిపై ల్యాండర్‌, రోవర్‌ను దించేందుకు యత్నించింది. అయితే చివరి రెండు నిముషాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొనడంతో ప్రయోగం విఫలమైంది. ఈ పర్యాయం విజయం సాధించేందుకు చంద్రయాన్‌–3లో భాగంగా మరోమారు ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడిపై దించేందుకు సంకల్పించింది. ఈ రెండు ప్రయోగాలు సక్సెస్‌ అయితే ఇస్రో ఖ్యాతి అంతర్జాతీయంగా మరింత ఇనుమడిస్తుందనడంతో సందేహం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement