కలువాయి(సైదాపురం) : ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కలువాయి మండలం లలితానగర్‌లో ఆదివారం జరిగింది. వివరాలు.. కొలపనాయుడుపల్లెకు చెందిన పారి రవీంద్ర ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ధాన్యం లోడుతో ట్రాక్టర్‌లో వస్తుండగా పంది అడ్డుపడింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడుతుండగా అందులో నుంచి రవీంద్ర దూకేశాడు. అయితే ప్రమాదవశాత్తు టాక్టర్ టైర్ల కింద పడిపోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బస్సుల ఢీ : 8 మందికి గాయాలు
తడ: జాతీయ రహదారిపై తడ బస్‌స్టాండ్ వద్ద ఆదివారం ముందున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన తమిళనాడు ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్‌ఐ కొండపనాయుడు కథనం మేరకు.. 30 మంది ప్రయాణికులతో కనిగిరి నుంచి చైన్నె వెళుతున్న ఆర్టీసీ బస్సు తడలో నిలిచింది. అదే సమయంలో 23 మందితో తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న తమిళనాడు ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. తమిళనాడు బస్సు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను 108లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోడి పందేలపై దాడి
సైదాపురం : మండలంలోని తూర్పుపూండ్ల గ్రామంలో నిర్వహిస్తున్న కోడి పందేలపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఆరుగురు పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. 3 కోళ్లు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
టపాకాయ పేలి బాలుడికి గాయాలు
కలువాయి(సైదాపురం) : కలువాయి మండలం గిరిజన కాలనీలో టపాకాయ పేలి ఓ బాలుడు గాయపడిన ఘటన ఆదివారం జరిగింది. వివరాలు.. వేకువజామున మంచు అధికంగా కురుస్తుండడంతో స్థానికులు చెత్తాచెదారాలను పోగేసి చలి మంట వేసుకున్నారు. అదే సమయంలో కాలనీకి చెందిన ఆదెయ్య, సుబ్బమ్మ దంపతుల కుమారుడు ఆదెయ్య అక్కడకు వచ్చాడు. ఈ క్రమంలో చెత్తలో ఉన్న టపాకాయ పేలడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.