ఆస్తులున్నా అనుభవించలేని దుస్థితి.. అమ్ముకోలేని పరిస్థితి.. వెరసి జీవితం దుర్భరం.. దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్న నిషేధిత భూముల యజమానులు.. ఈ దైనందిన స్థితి నుంచి ఎమ్మెల్యే భూమన విశేష కృషితో ఆ భూ యజమానులకు విముక్తి లభించింది. వారికి నేడు ఆ ఆర్డర్ కాపీలను అందజేయనున్నారు. దీనిపై ప్రత్యేక కథనం.
తిరుపతి తుడా: నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై 22ఏ నిషేధిత నిబంధన శాపంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించే నాథుడే లేకపోగా 2018లో నాటి ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాలను నివేధిత జాబితాలో చేర్చింది. దీంతో ఆస్తులున్నా అనుభవించలేని దయనీయ స్థితిలో నగర ప్రజలు దశాబ్దాలుగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి చొరవతో నిషేధిత జాబితాలోని 5,341 కుటుంబాలకు చెందిన భూములకు విముక్తి కల్పించారు.
ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రమబద్ధీకరణ ఆర్డర్ కాపీలను శివజ్యోతి నగర్ వాసులకు పంపిణీ చేశారు. దీంతో శివజ్యోతి నగర్, అయ్యప్పకాలనీ, ఎర్రకమిట్ట ప్రాంతాల్లోని 750 మందికి ఉపశమనం కలిగింది. ప్రస్తుతం మరోసారి 22ఏలోని నిషేధిత భూములకు మోక్షం లభించింది. తద్వారా సుమారు 10 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఈ జాబితా నుంచి విముక్తి పొందిన నగర ప్రజలకు బుధవారం పట్టాభిషేకం చేయనున్నారు.
50 ఏళ్లుగా నరకం
తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో భూములను 50 ఏళ్ల కిత్రమే 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీంతో ఆ భూములు క్రయవిక్రయాలకు నోచుకోలేదు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వారు 22ఏ నిబంధన విషయాన్ని పలుసార్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి నిషేధిత జాబితా నుంచి ఆ భూములకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నగరవాసుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఆ పాపంలో బాబూ భాగస్వామే
తిరుపతిలోని 2,300 ఎకరాలకు సంబంధించిన భూములపై నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018లో 22ఏ నిబంధన అస్త్రాన్ని ప్రయోగించింది. తప్పుల తడక కారణంగా ప్రభుత్వ, చుక్కల, దేవదాయ, మఠం భూములతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని భూములను ఆ జాబితాలో చేర్చింది. దీంతో గందరగోళం నెలకొనింది. ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎవరు ఎప్పుడు ఇచ్చిన జీఓ కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయో ఆధారాలసహా వివరించడంతో ప్రతిపక్ష పార్టీలు చేసేదిలేక ఆ పాపం తమ నాయకుడిదేనని తలవంచక తప్పలేదు.
104 ఎకరాలకు విముక్తి
104 ఎకరాలకు సంబంధించిన భూములు 22ఏ నిషేదిత జాబితా నుంచి విముక్తి పొందాయి. విముక్తి పొందిన ప్రాంతాల్లో తంబవాణిగుంట, కొర్లగుంట, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీ, నవోదయకాలనీ, ఎరుకుల కాలనీ, మారుతీనగర్, పూలవానిగుంట, ఆటోనగర్, అంబేడ్కర్‌కాలనీ, గొల్లవానిగుంట, బొమ్మగుంట, సూరయ్యకట్ట, ఎల్బీనగర్, సత్యనారాయణపురం, శ్రీకృష్ణనగర్, గాయత్రీనగర్, సుందరయ్యనగర్, సింగాలగుంట, రెడ్డిగుంట, తాతయ్యగుంట తదితర ప్రాంతాలు ఉన్నాయి.
ప్రజలకు ఎంత చేయాలో అంతాచేస్తాం
ప్రజా సమస్యలు, వినతులు, ఇబ్బందులు ఏవైనా నా వద్దకు వస్తే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ముందుంటాను. 22ఏ గుదిబండపై వచ్చిన అన్ని వినతులను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని భూములకు నిషేధం నుంచి విముక్తి కల్పించాం. రాబోవు రోజుల్లో మరిన్ని భూములకు ఆ నిబంధన నుంచి ఉపశమనం కల్పిస్తాం. ప్రజలకు ఎంత చేయాలో అంతా చేస్తాం. 10 వేల మందికి లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తోంది.
– భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే
ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం
నగరంలో ఎన్నో ఏళ్లుగా భూసమస్యకు ఏ ఒక్కరూ పరిష్కారం చూపకపోగా 2018లో దాదాపు 2,300 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల పాపం మూటకట్టుకున్నారు. ఆస్తులున్నా వాటిని అనుభవించలేని దుస్థితికి కారకులయ్యారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎంతో చర్చించి పరిష్కార మార్గాన్ని సాధించారు. వేలాది కుటుంబాలలో వెలుగులు నింపారు. రాబోవు రోజుల్లో తిరుపతి నగరం మరింత మంచిని చూడబోతోంది.
–భూమన అభినయ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, తిరుపతి
నేడు ఆర్డర్ కాపీల పంపిణీ
22ఏ జాబితాలోని 104 ఎకరాల భూములపై నిషేధం తొలగింపునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను బుధవారం సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో జరిగే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు.
భూమన కృషి అమోఘం
నగరంలోని 22ఏ నిషేధిత భూములకు విముక్తి కల్పించేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరి కృషిని నగరవాసులు కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment