తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభిమతమని, అందులో భాగంగానే ఉచిత మెగావైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని, రూ.3 వేల ఖరీదైన 43 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించారని తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి కొనియాడారు. ఆరు నెలల క్రితం చంద్రగిరిలో చేపట్టిన ఉచిత మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమం స్ఫూర్తితోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్రంలో పురుడుపోసుకుందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఉచిత మెగా వైద్యశిబిరాలు విజయవంతం కావడంతో సోమవారం తిరుపతి రూరల్ మండల పరిధిలోని రామానాయుడు కల్యాణ మండపంలో విజయోత్సవ సభను నిర్వహించారు.
మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో భాగస్వామ్యులైన 9,700 మంది అధికారులు, సిబ్బందికి రైస్ కుక్కర్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏ పనిచేసినా పట్టువదలకుండా విజయవంతంగా పూర్తిచేస్తారన్నారు. ఆరు నెలల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఉచిత మెగావైద్య శిబిరాలను ప్రభుత్వం నిశితంగా గమనించిందన్నారు. ఆ వైద్య శిబిరాలకు ప్రజల నుంచి వచ్చే స్పందన, ఆరోగ్యం పట్ల జనం చూపిన శ్రద్ధ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అమలు చేసిందన్నారు.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ అధికారుల వద్ద ప్రస్తావించారని గుర్తుచేశారు. అంతకుముందు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉండడం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. తుడా వీసీ హరిక్రిష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుడా కార్యదర్శి లక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్‌నాయుడు, ప్రివియా హెల్త్ సంస్థ నిర్వాహకులు ఫణీతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరు మండలాలు.. ఆరు నెలలు.. 1.22 లక్షల మందికి పరీక్షలు
ఆరు మండలాలు.. 109 గ్రామ సచివాలయాలు.. ఆరు నెలలు.. 500పైగా ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 1.22 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తిచేయించారు. ప్రతి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలతో పాటు గుండె పరీక్షలు చేయించారు. గుండె పరీక్షల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు కలిగిన వారిని గుర్తించి పెద్ద ఆస్పత్రిలకు పంపి సకాలంలో వైద్య సేవలు అందించారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందిని ప్రాణాపాయం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి రక్షించారు.
అసాధ్యాలను సుసాధ్యం చేశారు
చంద్రగిరిలో ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రమంతా చెప్పుకుంటారని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే ఉంటుందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడించారు. ఉచిత మెగా వైద్య శిబిరాల వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించామన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల మందికిపైగా ఈసీజీ తీస్తే అందులో సుమారు 3వేల మందికి హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టు గుర్తించగలిగామన్నారు. తొండవాడ పంచాయతీ కార్యదర్శి నజిరీన్ బేగం భర్తకు ఈసీజీ తీసిన వెంటనే అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించి స్విమ్స్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడి వైద్యులు ఆగమేఘాలపై యాంజియో తీసి స్టంటు వేసి ప్రాణం నిలబెట్టారంటూ కన్నీరు పెట్టుకున్నారు.
9,700 మందికి రైస్ కుక్కర్లు పంపిణీ
ఉచిత వైద్య శిబిరాలు విజయవంతం కావడానికి కష్టపడిన ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు, 104 సిబ్బందితో పాటు ప్రివియా హెల్త్ సంస్థ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు అందరినీ విజయోత్సవ సభకు ఆహ్వానించి పది రకాల వంటకాలతో శాఖాహార భోజనం ఏర్పాటు చేశారు. సభకు హాజరైన 9,700 మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 7.5 లీటర్ల మల్టీ పర్పస్ రైస్ కుక్కర్లను బహుమతిగా అందించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వారికి సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలే నా కుటుంబం.. వారి కోసం ఏదైనా చేస్తా..
‘చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించాను.. వారి క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను.. కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తు వచ్చినా.. పండుగలు వచ్చినా.. పర్వదినాలైనా అందరికీ మంచి చేయాలన్న తపనతో వారి వెంట నిలబడుతున్నాను. నా కుటుంబం వేరు కాదు.. నా ప్రజలు వేరు కాదని బలంగా నమ్మిన వ్యక్తిని కనుకనే నా బిడ్డ మోహిత్‌రెడ్డికి కూడా ఈ వేదికపై నుంచి సూచిస్తున్నా.. రాజకీయాల్లోకి వచ్చాక కుటుంబం వేరు, ప్రజలు వేరు అనుకుంటే రాజకీయనాయకుడే అవుతావు.. కుటుంబం, ప్రజలు ఇద్దరూ ఒక్కటే అనుకుంటే నాయకుడు అవుతావు’ అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అత్యధిక సమయం విజయవాడలో గడపాల్సి వస్తున్నందున తన బిడ్డ మోహిత్‌రెడ్డిని తనలాగా ఆదరించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞిప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment