చిత్తూరు: ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. ఆపై పెళ్లిమాట ఎత్తగా ఎప్పటికప్పుడు దాటవేస్తూ తప్పించుకోవడం ప్రారంభించాడు. గట్టగా నిలదీయగా.. ‘మీది వేరే కులం.. నిన్ను చేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు’ అంటూ ముఖంపై తెగేసి చెప్పేశాడు. పాపం.. అతనే జీవితమని నమ్ముకున్న ఆ ప్రియురాలి మనసు కకావికలమైంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. మిద్దైపె నుంచి ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉరివేసుకుని తనువు చాలించింది.
ఈ ఘటన వెంకటగిరి పట్టణంలోని 5వ వార్డు కాలేజీ మిట్టలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మృతురాలి తల్లి భారతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భారతికి కుమారుడు, కుమార్తె కావ్య ఉన్నారు. కావ్య (25) బీటెక్ పూర్తిచేసి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి నిమిత్తం విధులు నిర్వర్తిస్తుండగా పెళ్లకూరు మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో తేజ పెళ్లి చేసుకుంటానని కావ్యను నమ్మించాడు.
దీంతో కావ్య తేజకు దగ్గరైంది. అలా రెండేళ్ల వరకు గడిచాయి. కావ్య తేజాతో పెళ్లి విషయంపై మాట్లాడినప్పుడల్లా అతను ఏదో ఒకరకంగా మాట్లాడుతూ దాటవేసేవాడు. కావ్య అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో ‘మీది వేలే కులం.. మాది వేరే కులం.. నిన్ను పెళ్లిచేసుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను’ అంటూ యువతికి సమాధానం ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య శుక్రవారం రాత్రి ప్రియుడు తేజాకు చివరి సారిగా ఫోన్‌చేసి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది.
అతను ఒప్పుకోకపోవడంతో విఽధిలేని పక్షంలో ఆ యువతి ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ తన ఇంటి మిద్దైపెన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య ఎంతకీ కనిపించకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు మిద్దైపెకి వెళ్లి పరిశీలించగా.. ఆమె విగత జీవిగా ఉరితాడుకు వేలాడుతోంది. కావ్య ఫోన్ కాల్‌డేటా ఆధారంగా మృతురాలి తల్లి భారతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment